
హైదరాబాద్ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో భారీ అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు, దానికి కాంగ్రెస్ మంత్రులు ఇచ్చిన కౌంటర్లతో నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సవాళ్ల పర్వం కాస్తా పోలీసుల మోహరింపు, తోపులాటలు, చివరకు ప్రతిపక్ష నేతల అరెస్టుల వరకు దారితీసింది.
గురుకులాల్లో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ మంత్రులు సిద్ధమయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ తదితరులు గన్‌పార్క్ వద్దకు చేరుకుని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు ఎవరు వచ్చినా చర్చకు సిద్ధమని, సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో దీనిపై తేల్చుకుందామని మంత్రులు స్పష్టం చేశారు.
గురుకులాల కొనుగోళ్ల ప్రక్రియపై బీఆర్ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు బాగుపడుతుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని ఆరోపించారు. నాలుగు శాఖల ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా టెండర్లు పిలిచామని, మొత్తం కొనుగోలు ప్రక్రియ ఓపెన్‌గా జరిగిందని స్పష్టం చేశారు. “మీ ఆరోపణలు నిజమైతే చర్చకు రావాలి. కేవలం ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారంతో మాట్లాడటం సరికాదు. ప్రజలు ఎన్నుకున్న నాయకులే చర్చకు రావాలని కోరుతున్నాం. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రొక్యూర్మెంట్పై కూడా మేం చర్చకు సిద్ధం” అని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. గతంలో అధికారిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
మరోవైపు, కాంగ్రెస్ మంత్రుల సవాల్‌ను స్వీకరించిన బీఆర్ఎస్ నేతలు కూడా చర్చకు సై అన్నారు. గురుకులాల అవినీతితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ అప్పులపై కూడా చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ అప్పులపై చర్చించేందుకు తాను వస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పినందున, కేటీఆర్ తెలంగాణ భవనంలోనే ఉంటారని హరీశ్‌రావు తెలిపారు.
అనంతరం హరీశ్‌రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరికొందరు నేతలతో కలిసి మంత్రులతో చర్చించేందుకు అమరవీరుల స్తూపం వైపు బయల్దేరారు. అయితే, శాంతిభద్రతల సమస్య దృష్ట్యా పోలీసులు తెలంగాణ భవన్ వద్దే హరీశ్‌రావు వాహనాన్ని అడ్డుకున్నారు. చర్చకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని హరీశ్‌రావు పోలీసులను గట్టిగా నిలదీశారు. “హాస్టళ్ల కొనుగోళ్లలో ఖచ్చితంగా అవినీతి జరిగింది. అందుకే కాంగ్రెస్ మంత్రులు భయపడుతున్నారు. మమ్మల్ని పోలీసులతో అడ్డుకుంటున్నారంటేనే ప్రభుత్వం చర్చ నుంచి పారిపోతోందని అర్థమవుతోంది. పోలీసుల ఆంక్షలకు భయపడం, గన్‌పార్క్‌కు నడుచుకుంటూనే వెళ్తాం.” అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
వాహనాన్ని అడ్డుకోవడంతో హరీశ్‌రావు తన కారు దిగి కార్యకర్తలతో కలిసి కాలినడకన ముందుకు సాగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా నినాదాలు చేశారు. చివరకు పోలీసు వలయాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్తున్న హరీశ్‌రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పలువురు ముఖ్య నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
మరోవైపు తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి జూపల్లి కృష్ణారావుకు కుర్చీ వేసి చర్చకు సిద్ధమయ్యారు. తెలంగాణ భవన్ లోనే చర్చకు సిద్ధమని జూపల్లి కృష్ణారావు చెప్పారని, తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ప్రకటించారు. అయితే చర్చించే ధైర్యం లేక జూపల్లి రాలేదని ఎద్దేవా చేశారు.