
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Revanth Reddy @ 20 Years: తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభించి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఒక స్వతంత్ర అభ్యర్థిగా జీవితం ప్రారంభించి అనంతరం రాష్ట్ర అత్యున్నత స్థాయి పదవిని అలంకరించారు. చిన్నగా ప్రారంభమైన అతడి రాజకీయ జీవితం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఉమ్మడి పాలమూరు నుంచి ముఖ్యమంత్రిగా అయిన రెండో వ్యక్తిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు. ఆయన రెండు దశాబ్దాల రాజకీయ చరిత్రపై
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా ఆయన వేసిన తొలి అడుగు.. నేడు ఆయనను రాష్ట్ర అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టింది. ప్రజాప్రతినిధిగా ఆయన ప్రస్థానం ప్రారంభమై ఈనెల జూలై 4 నాటికి సరిగ్గా 20 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా తనకు రాజకీయ జీవితం ఇచ్చిన మిడ్జిల్‌లో జూలై 4వ తేదీన రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మిడ్జిల్ ప్రజల సమక్షంలోనే ప్రజాప్రతినిధిగా తన జీవితం ప్రారంభించిన రోజును గుర్తుచేసుకోనున్నారు. అప్పట్లో తన గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం కానున్నారు. ప్రజాప్రతినిధి నుంచి సీఎం పీఠం దాకా సాగిన తన కెరీర్ పునాదిగా నిలిచిన మిడ్జిల్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. తన రాజకీయ ప్రయాణంలో తనను ప్రజాప్రతినిధిగా తొలిసారి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలనే భావనతోనే.. 'మీ బిడ్డను.. మళ్లీ వస్తున్నా... మీ ఆశీర్వాదం, ఆదరణతోనే రాష్ట్రానికి సేవ చేసే అవకాశం వచ్చింది' అనే భావంతో మిడ్జిల్ ప్రజల ముందుకు వస్తున్నారు.
విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తొలి అడుగు స్వతంత్రంగానే పడింది. ఉమ్మడి రాష్ట్రంలో 2006 పరిషత్ ఎన్నికల్లో మిడ్జిల్ జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జూలై 4వ తేదీన విజయం సాధించారు. మరుసటి ఏడాది 2007లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి శాసనమండలిలో తొలిసారి అడుగుపెట్టారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డి తన సరికొత్త పంథాతో ఆ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు.
కొడంగల్ నియోజకవర్గం నుంచి 2009, 2014లో పోటీ చేసి ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ శాసనభలో టీడీపీఎల్పీ.. బీఆర్ఎస్ఎల్పీలో విలీనం కావడం.. తెలుగుదేశం మనుగడ ప్రశ్నార్థకం కావడంతో రేవంత్ రెడ్డి ప్లేటు ఫిరాయించి పార్టీ మారారు. వెంటనే టీడీపీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని జనాకర్షక నాయకుడిగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారు. ప్రజల్లో రేవంత్‌రెడ్డికి వస్తున్న స్పందనను గ్రహించిన అధిష్ఠానం 2018 ఎన్నికలకు ముందు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. అయితే 2018 ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ కొడంగల్పైన ప్రత్యేక దృష్టి సారించడం, ఇతర పరిణామాల నేపథ్యంలో ఆ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి మాటతప్పారు. అనంతరం2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానంలో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఎంపీగా విజయం సాధించారు.
2021 జూలై 7వ తేదీన టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ పగ్గాలు అందుకున్న రేవంత్‌రెడ్డి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి చేర్చారు. 2023 డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ముఖ్యమంత్రి పీఠం వరకూ సాగిన రేవంత్‌రెడ్డి ప్రస్థానంలో మిడ్జిల్ జడ్పీటీసీ అభ్యర్థిగా ఆయన సాధించిన తొలి విజయం ప్రత్యేకమనే చెప్పవచ్చు. ఆ ప్రత్యేకతను మరోమారు గుర్తు చేసుకునేందుకు రేవంత్‌రెడ్డి జూలై 4న మిడ్జిల్‌లో పర్యటించనున్నారు.
రేపు మిడ్జిల్ పర్యటన మిడ్జిల్ పర్యటనకు రానున్న రేవంత్ రెడ్డి మొదట ఊరుకొండ ఆలయాన్ని సందర్శించనున్నారు. తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన అనుచరులు, ఆత్మీయులు, ముఖ్య నాయకులు, ఆనాటి పెద్దలతో కలిసి 'ఆత్మీయ విందు' చేస్తారు. మిడ్జిల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేస్తారు. ఈ సంధర్భంగా మిడ్జిల్ మండలంపై వరాల జల్లు కురుపించే అవకాశం ఉంది. ఇప్పటికే మిడ్జిల్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే.