Petrol Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారా అని వాహనదారులు ఎదురుచుస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి.
ఇరాన్- అమెరికా యుద్ధం ముందటి స్థాయికి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. ప్రస్తుతం 71 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. ఈ క్రమంలో దేశంలో ఇంధన ధరలు తగ్గించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర చమురు, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక ప్రకటన చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై మాట్లాడారు. ఆ వివరాలు తెలుసుకుందాం. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినా దేశీయంగా ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచడం వల్ల భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ 30 నాటికి రూ.74,781 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోయినప్పటికీ పాత క్రూడాయిల్ నే ఇప్పటికీ ప్రాసెస్ చేస్తున్నాయని, ధరలు తగ్గకపోవడానికి ఇదే కారణమని చెప్పారు. ఈ మేరకు గురువారం రోజున విలేకరులతో మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలపై వివరాలు వెల్లడించారు. ' పెట్రో ఉత్పత్తులను ప్రాసెసే చేసేందుకు 2 నెలల ముందే క్రూడ్ ఆయిల్‌ను చమురు మార్కెటింగ్ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. 2 నెలల ముందు నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. అంటే ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్న ఆయిల్ ఏప్రిల్ లేదా మే నెలలో కొన్నది. అప్పట్లే అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు అధికంగా ఉన్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరాక ఆయిల్ ధరలు దిగివచ్చాయి. రాబోయే కొన్ని వారాల పాటు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గించరా అని అడగడం సమంజసమైన ప్రశ్న అవుతుంది' అంటూ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 71.47 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఫిబ్రవరి చివరి వారంలో ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలైంది. గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేయడంతో పాటు హార్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో భారత్ వంటి దిగుమతిపై అధికంగా ఆధారపడే దేశాలపై తీవ్ర ప్రభావం పడుంది. డాలర్ విలువ పెరిగి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఏప్రిల్ 29వ తేదీన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 118 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకింది. దీంతో భారత్ భారీగా విదేశీ మారకం నిల్వలను వెచ్చించాల్సి వచ్చింది. దీంతో దేశీయంగా లీటర్ పెట్రోల్ ధరను రూ.7.50 మేర పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర 71 డాలర్ల స్థాయికి దిగివచ్చిన క్రమంలో పెంచిన పెట్రోల్ ధరను తగ్గించాలని వాహనదారులు కోరుతున్నారు. అయితే, నష్టాలను పూడ్చుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.