కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం వీబీ జీ రామ్ జీ పథకాన్ని తిరుపతి జిల్లా ముక్కాలవారి పల్లెలో గురువారం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు తాను మేనమామ లాంటి వాడ్ని అని.. మేనమామ ఎప్పుడూ ఒట్టి చేతులతో రాడని, అన్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు తనను ఆప్యాయంగా 'మామాజీ' అని పిలుచుకుంటారని, ఆంధ్రా ప్రజలకు కూడా తాను ఇప్పుడు మేనమామను అయ్యానని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆయన వరాల జల్లు కురిపించారు. మామిడి రైతులను ఆదుకోడానికి మద్ధతు ధర ఇచ్చేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద 2.16 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి సేకరించే ప్రతిపాదనతో ముందుకు వచ్చానని ఆయన చెప్పారు. అలాగే, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ.422 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లకు అందజేశారు.ఈ పథకం ఆంధ్రప్రదేశ్ నుంచి మొదట ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం చారిత్రక ఘట్టమని కేంద్ర మంత్రి శివరాజ్ చౌహన్ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా గ్రామాభివృద్ధి కోసం వీబీ జీ రామ్ జీ పథకం కింద రూ.7.5 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నామని, ప్రతి గ్రామానికి రూ.2 కోట్లు అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం కింద వచ్చే 9 నెలలకు గాను ఏపీకి రూ.7,700 కోట్లు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామీణ వికాసానికి ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. తమకు అవసరమైన పనులను గ్రామ సభలే నిర్ణయించుకుని అమలు చేసే అధికారం ఈ పథకం కల్పిస్తుందని ఆయన వివరించారు.అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చౌహన్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున ఒక మొక్క నాటాలని ఆయన పిలుపునిచ్చారు.