తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బ్రిటన్ పర్యటనలో లండన్లోని ‘ది షార్డ్’ వద్ద ఏర్పాటు చేసిన అభిమానుల సమావేశం రద్దు అయింది. అత్యధిక సంఖ్యలో జనం తరలిరావడంతో మెట్రోపాలిటన్ పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని అక్కడి నిర్వాహుకులు మైక్ ద్వారా చెప్పగా.. అప్పటికే లైన్లలో వేచి ఉన్న అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఈ పర్యటనలో మొత్తంగా రూ. 12,300 కోట్ల విలువైన పలు కీలక అవగాహన ఒప్పందాలపై ఆయన సంతకం చేసినట్లు ప్రకటించారు.





