
లండన్: యునైటెడ్ కింగ్డమ్ విచ్ఛిన్నం వైపు పయనిస్తున్నట్టు కనిపిస్తున్నది. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌కు నాయకత్వం వహిస్తున్న పార్టీలు గతంలో జరిగిన ఒప్పందంలోని కొన్ని భాగాలను ప్రశ్నిస్తున్నాయి. ఆ పార్టీల నాయకులు తమ ఉమ్మడి ప్రయోజనాలను ఒక సమన్వయ సాధనంగా మార్చడానికి సిద్ధమవుతున్నారు. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ఆ మూడు ప్రాంతాల ఫస్ట్ మినిస్టర్లు సోమవారం కార్డిఫ్‌లో సమావేశమై ప్రజాస్వామ్య మార్గాల ద్వారా స్వాతంత్య్రం సాధించే హక్కు సహా స్వీయ నిర్ణయాధికారానికి సంబంధించిన ఒక ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయనున్నారు. వారి సందేశం యూకే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. స్కాట్లాండ్ స్వాతంత్య్రంపై జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణ గురించి యూకే ప్రధాని బర్న్‌హామ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కార్డిఫ్ సమావేశంలో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. ఇటీవల హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడుతూ తగినంత స్పష్టమైన ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే మరో ఓటింగ్ జరుగుతుందని బర్న్‌హామ్ అన్నారు. ఐర్లాండ్ పునరేకీకరణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం ఆ దేశ రాజధాని డబ్లిన్ సందర్శనలో చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐక్య ఐర్లాండ్‌ను చూడాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలు బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. మరోవైపు ‘చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ల స్వాతంత్య్రానికి అనుకూలంగా ఉండే ఫస్ట్ మినిస్టర్లు వాటికి నాయకత్వం వహిస్తున్నారు. తదుపరి భవిష్యత్తుకు యూకే ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి’ అని స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమైన రాజ్యాంగ మార్పు వాదన కాదనలేనిదని.. ఆండీ బర్న్‌హామ్ ఇప్పుడు యూకే చివరి ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయే ఆలోచనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ‘రేపు కార్డిఫ్‌లో మా మూడు దీవులకు కావాల్సిన మెరుగైన భవిష్యత్తు గురించి మిగతా ఫస్ట్ మినిస్టర్లతో చర్చిస్తాను. స్వాతంత్య్రం కావాలనే అంశంతో అది మొదలవుతుంది’ అని స్విన్నీ అన్నారు. గుడ్ ఫ్రైడే ఒప్పందం ప్రకారం ఐర్లాండ్‌తో పునరేకీరణపై రెఫరెండం నిర్వహించే రాజ్యాంగబద్ధ మార్గం ఉత్తర ఐర్లాండ్‌కు ఉంది.





