
దిల్లీ: వాయు కాలుష్యం ఆత్మహత్య ఆలోచనల్ని పెంచుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా అతిసూక్ష్మ పరిమాణం కలిగిన 2.5 పీఎం, 10 పీఎం ధూళి కణాలు, నైట్రోజన్‌ డయాక్సైడ్‌లు ఈ ఆలోచనల్ని అధికంగా ప్రేరేపిస్తాయని జర్నల్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ కమ్యూనిటీ హెల్త్‌ తాజా సంచికలో ప్రచురించిన అధ్యయన నివేదిక పేర్కొంది. ఆత్మహత్య నివారణ చర్యల్లో భాగంగా పర్యావరణ కాలుష్యానికి దూరంగా ఉండటం మంచి ఫలితాలను ఇస్తుందని ఆ నివేదిక తెలిపింది. ఆత్మహత్యలు, ఆత్మహత్య ఆలోచనలపై కాలుష్య ప్రభావం అనే అంశంపై వెలువడిన 29 అధ్యయన నివేదికలను విశ్లేషించి బ్రిటన్‌కు చెందిన బెల్‌ఫాస్ట్‌లోని క్వీన్స్‌ యూనివర్సిటీ బృందం తాజా నివేదికను సిద్ధం చేసింది. కుంగుబాటు వంటి మానసిక ఆరోగ్య సమస్యలపై పర్యావరణ ప్రభావ అంశం గురించి అనేక అధ్యయనాలు జరిగాయి కానీ కాలుష్యం ఆత్మహత్య ఆలోనల్ని ఎలా ప్రేరేపిస్తుందన్న దానిపై ఇప్పటివరకూ అంతగా దృష్టి పడలేదు. ‘‘దీర్ఘకాలం 2.5 పీఎం, 10 పీఎం పరిమాణం కలిగిన ధూళి రేణువుల ప్రభావానికి, నైట్రోజన్‌ డయాక్సైడ్‌ ప్రభావానికి గురైనవారిలో ఆత్మహత్య ఆలోచనలు ప్రబలినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి’’ అని నివేదిక పేర్కొంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





