Russia Oil : అంతర్జాతీయ రాజకీయాల (International Polytics) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా చమురు (Russia Oil) కొనుగోళ్లపై అమెరికా (USA) కొరడా ఝలిపించింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు (Tariffs) విధించే అధికారాన్ని అధ్యక్షుడికి కట్టబెట్టే బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President) సంతకం కోసం సిద్ధంగా ఉంది. ఈ పరిణామం రష్యా నుంచి భారీగా ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న భారత్ (India) పై తీవ్ర ప్రభావం చూపనుంది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై అమెరికా కొత్త చట్టం ప్రభావం ఏవిధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా 2022 నుంచి భారత్‌కు రష్యా అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారింది. గణాంకాల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 40.8 బిలియన్ డాలర్ల విలువైన రష్యా ముడిచమురును దిగుమతి చేసుకుంది. ఇది దేశం మొత్తం చమురు దిగుమతుల్లో 30.3 శాతానికి సమానం. 2026 జూలై నాటికి ఈ వాటా ఏకంగా 51 శాతానికి పెరిగింది. దేశీయ అవసరాల కోసం భారత్ 88 శాతానికి పైగా ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో రష్యా చమురు ప్రాధాన్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అమెరికా చట్టం కారణంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆగిపోతే వెంటనే పెట్రోల్ బంకుల్లో ధరలు పెరుగుతాయని చెప్పలేం. భారత రిఫైనరీలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవచ్చు. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. రష్యా నుంచి లభించే రాయితీలు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. ప్రత్యామ్నాయ చమురుకు ఎక్కువ వెల చెల్లించాల్సి రావచ్చు. అంతేకాకుండా ప్రపంచ మార్కెట్లోకి రష్యా చమురు రాక తగ్గితే మొత్తం సరఫరా తగ్గి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇది భారత్‌పై పరోక్షంగా పెను భారాన్ని మోపుతుంది. ఈ కొత్త అమెరికా చట్టం ప్రకారం టారిఫ్‌లు భారత్‌లో అమ్మే పెట్రోల్‌పై నేరుగా కాకుండా అమెరికాకు భారత్ చేసే ఎగుమతులపై వర్తిస్తాయి. అంటే భారత్ రష్యా నుంచి చమురు కొనసాగిస్తే అమెరికాతో వాణిజ్యపరమైన రిస్క్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ రష్యా నుంచి కొనుగోళ్లు ఆపేస్తే అధిక ధరలకు ఇతర దేశాల నుంచి చమురు కొనాల్సి వచ్చి ఆర్థిక భారం పెరుగుతుంది. ఇలా భారత్ ఒకరకమైన సంకట స్థితిలో పడింది. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను అంతర్జాతీయ ధరలు, పన్నులు, రవాణా ఛార్జీలు, డీలర్ కమీషన్ల ఆధారంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయి. గతంలో ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం వినియోగదారులపై భారం తగ్గించడానికి ఎక్సైజ్ సుంకాలను సర్దుబాటు చేసింది. ఇప్పుడు కూడా తుది నిర్ణయం అంతర్జాతీయ ముడిచమురు ధరలు, ప్రత్యామ్నాయ సరఫరాల ఖర్చు, రూపాయి-డాలర్ మారకం విలువ, రిఫైనరీ మార్జిన్లు, ప్రభుత్వ విధానాలపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల పెట్రోల్ ధర ఎంత పెరుగుతుందనే దానిపై కచ్చితమైన అంచనాకు రావడం ప్రస్తుతానికి సాధ్యం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.