

- ఘనంగా విమోచన వేడుకలు
- నిజాంపై తీవ్ర విమర్శలు
- కిషన్ రెడ్డి సవాల్
Kishan Reddy: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా సాగాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్ కుమార్ నిజాం నిరంకుశ పాలన, తెలంగాణ పోరాట చరిత్రను స్మరించుకున్నారు. గణేశ్ నవరాత్రులు, విశ్వకర్మ జయంతి, ప్రధాని మోదీ పుట్టినరోజు, విమోచన దినోత్సవం ఒకే రోజు రావడం తెలంగాణ ప్రజలకు ఒకేసారి నాలుగు పండుగలు వచ్చినంత ఆనందాన్ని ఇస్తోందని ఈ సందర్భంగా బండి సంజయ్ అభివర్ణించారు.
నిజాం పాలనపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు:
సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్పంతోనే హైదరాబాద్ భారత యూనియన్లో విలీనమైందని బండి సంజయ్ కొనియాడారు. నిజాం నిరంకుశ పాలనలో వేలాది మంది ప్రజల ప్రాణాలు, ఆస్తులు నష్టపోయాయని, అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో గొప్పవాడిగా చిత్రీకరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వీర బైరాన్పల్లి, పరకాల, నిర్మల్ వంటి ప్రాంతాల్లో జరిగిన ఘోరాలను విమర్శకులు గుర్తుచేసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రం గడిచిన 12 ఏళ్లలో రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని, ప్రజలు అవినీతి రహిత పాలనకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
కిషన్ రెడ్డి సవాల్.. సంస్కృతిక కార్యక్రమాలు:
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం పాలనలో తెలుగు భాషను అణచివేసి ఉర్దూను రుద్దారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఓట్ల రాజకీయాల కోసమే నిజాంను పొగుడుతున్నారని, అదే నిజమైతే ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2029 నాటికి తెలంగాణలోని ప్రతి గ్రామంలో అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని, సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగరేయకుండా అడ్డుకునే ధైర్యం ఎంఐఎం, కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు ఉందా అని సవాల్ విసిరారు. వేడుకల్లో భాగంగా పారామిలటరీ బలగాల కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.




