
వాషింగ్టన్: రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ‘లిండ్సే ఓ. గ్రాహమ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’గా పిలుస్తున్న ఈ బిల్లుకు 262-159 ఓట్లతో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే సెనేట్ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం వెళ్లనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లను కొనసాగించే దేశాలపై అమెరికా అధ్యక్షుడికి 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం లభిస్తుంది. ఈ నిబంధన ప్రధానంగా రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రష్యా ఇంధన రంగంతో పాటు ఆ దేశ బ్యాంకులు, రక్షణ రంగం, ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై కూడా ఈ బిల్లు కఠిన చర్యలకు అవకాశం కల్పిస్తుంది. ఇరాన్‌పై ఉన్న కొన్ని ఆంక్షలను కూడా పొడిగించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. అమెరికా హౌస్‌లో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో భారత్ స్పందించింది. దేశ ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని వివిధ దేశాల నుంచి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అమెరికా తీసుకునే కొత్త చర్యలు భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఇప్పటికే అమెరికా అధికారులతో భారత్ చర్చించినట్లు తెలిపింది. వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా న్యూఢిల్లీ పేర్కొంది. ప్రస్తుతం ఈ బిల్లు ట్రంప్ సంతకం కోసం ఎదురుచూస్తోంది. సంతకం అనంతరం అమల్లోకి వచ్చే నిబంధనల ఆధారంగా భారత్‌పై వాస్తవ ప్రభావం ఎంతమేర ఉంటుందన్నది స్పష్టమవుతుంది.





