
Cheyutha | కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 15 : రెండున్నరేళ్లుగా కొత్త ‘చేయూత’ పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం కల్పించిన దరఖాస్తు అవకాశం చివరి దశలో ఇబ్బందుల పర్వంగా మారింది. పింఛన్ వస్తుందన్న ఆశతో దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమైన పేదలు.. గడువు ముగుస్తుండటం, అవసరమైన ధ్రువపత్రాలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వరుస సెలవులు రావడంతో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడటం వారి సమస్యను మరింత పెంచింది. తొలుత నిర్ణయించిన గడువును ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. అయితే రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయక చవితి సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో దరఖాస్తుదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అవసరమైన ధ్రువపత్రాల కోసం కార్యాలయాలకు వెళ్లినా.. సెలవుల కారణంగా పనులు జరగక పలువురు నిరాశతో వెనుదిరిగారు. వితంతు పింఛన్ కోసం భర్త మరణ ధ్రువపత్రం కీలకం. చాలామంది గతంలో ఆ ధ్రువపత్రం తీసుకోకపోవడంతో ఇప్పుడు దరఖాస్తు సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. మరణించి రెండేళ్లు దాటిన సందర్భాల్లో తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలో ధ్రువపత్రం జారీ చేయాల్సి ఉండటంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఆదాయ ధ్రువపత్రం లేకున్నా రేషన్‌కార్డు నకలు జతచేయవచ్చని అధికారులు సూచించినప్పటికీ.. విచారణ సమయంలో అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవైపు దరఖాస్తు గడువు ముగియనుండగా.. మరోవైపు వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణకు అధికారులు పరుగులు పెడుతున్నారు. ఈ నెలాఖరులోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు రావడంతో మంగళవారం నుంచి పరిశీలన ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో తిరుగుతూ అర్హత లేని దరఖాస్తులను పరిశీలన దశలోనే తిరస్కరించనున్నారు. దసరా నుంచి కొత్త పింఛన్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే కొత్త పింఛన్ల కోసం రెండున్నరేళ్లు వేచి చూసిన వారికి.. దరఖాస్తుకు మాత్రం కొద్ది రోజులే ఎందుకు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వరుస సెలవుల నేపథ్యంలో కనీసం మరోసారి గడువు పొడిగించి, అర్హులెవరూ అవకాశం కోల్పోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,32,229 మంది ‘చేయూత’ పింఛన్లు పొందుతున్నారు. కొత్త పింఛన్ల కోసం ప్రజావాణిలో చాలాకాలంగా విన్నపాలు అందుతున్నాయి. ప్రభుత్వం దరఖాస్తులకు అవకాశం కల్పించడంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 25 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీటిలో సుమారు 11 వేల వరకు వితంతువులు, 2 వేల వరకు గీత కార్మికులు, మరో 2 వేల వరకు చేనేత కార్మికులు, 2,500 వరకు ఒంటరి మహిళలు ఉన్నారు. హీమోఫీలియా, తలసేమియా, సికిల్‌సెల్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారి దరఖాస్తులు కూడా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పింఛన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు.. దరఖాస్తుకు గడువు గుబులు.. సర్టిఫికెట్ల కోసం చక్కర్లు.. ఇవన్నీ కలిపి అర్హుల ‘చేయూత’ ఆశలను పరీక్షిస్తున్నాయి. ప్రభుత్వం గడువు పొడిగించి, ధ్రువపత్రాల జారీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందా? లేక గడువు ముగిసిందని చేతులు దులుపుకుంటుందా? అన్నది వేచి చూడాలి.





