
తిరుమల: తిరుమలలో కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల, పుష్ప, ఫొటో, గార్డెన్‌, అటవీ, ఎస్వీఐటీఎస్ఏ, ఆయుర్వేద తదితర ప్రదర్శనలతో పాటు మీడియా సెంటర్‌ను తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం తితిదే చేసిన విస్తృత ఏర్పాట్లను, బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు తెలియజేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కోరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మీడియా ప్రతినిధులు విస్తృతంగా వార్తా కథనాలు అందించేందుకు వీలుగా మీడియా సెంటర్‌లో వైఫై, కంప్యూటర్లు, ప్రింటర్లు తదితర అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఛైర్మన్ తెలిపారు. తిరుమలలో గతంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అరుదైన ఛాయాచిత్రాల ద్వారా తెలియజేసే ‘నాడు-నేడు’ ఫొటో ప్రదర్శన ఎంతో ప్రత్యేకంగా ఉందన్నారు. ఈ ప్రదర్శన భక్తులకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక, చారిత్రక అనుభూతిని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, సీపీఆర్వో డాక్టర్ టి. రవి తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.