
కొత్త చిత్రాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారం రానే వచ్చింది. ఈ సారి మాత్రం సినిమాలతో కాదు సిరీస్‌లతో అలరించడానికి ఓటీటీలు సన్నద్ధమయ్యాయి.
వైవిధ్యమైన కంటెంట్‌తో యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సిరీస్‌లు సినీప్రియుల్ని టీవీల ముందు కట్టిపడేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
జీవితంలో కోల్పోతున్న బంధాలు, ప్రేమ, స్నేహం, మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసే అద్భుతమైన సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. ఇందులో సంతోష్ అనే వ్యక్తి ఓ ప్రమాదంలో తన జ్ఞాపకాలన్నీ కోల్పోతాడు. పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందడానికి అతనికి జీవితం రెండో అవకాశం ఇస్తుంది. ఈ క్రమంలో ప్రేమ, స్నేహం లాంటి భావనల మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అనూహ్యమైన మలుపులతో సంతోష్ ఏ విధంగా పోరాటం చేస్తాడో తెలియాలంటే ఈ సిరీస్ చూసేయ్యండి. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ వేదికగా జులై 3 నుంచి ప్రసారం కానుంది. ఇందులో విరాజ్ అశ్విన్, యశశ్రీ జంటగా నటించారు.వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్రనాయుడు నిర్మించారు.
సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’. ఇందులో సుబ్బు ఓ ఊర్లో లైంగిక విద్యను బోధించే తాత్కాలిక ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కుటుంబ నియంత్రణ అంశంపై పాఠాలు చెప్పే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు? ఆ ఊరి ప్రజలు సుబ్బును చంపడానికి ఎందుకు వెంటపడతారు? ఉద్యోగం పర్మినెంట్ కావడం కోసం వెళ్లిన సుబ్బు.. అక్కడ ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడో తెలుసుకోవాలంటే ఈ కామెడీ సిరీస్ చూడాల్సిందే. గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో బ్రహ్మానందం, మురళీశర్మ, సంపూర్ణేశ్‌బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.