
Venezuela Earthquake| కారకస్: వెనెజువెలా విలయం ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఇప్పటికీ శిథిలాల కింద వేలాదిమంది చిక్కుకుపోయి ఉన్నారు. వారు ప్రాణాలతో ఉంటారన్న ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయి.
ఈ సమయంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి బహిష్కరణకు గురైన 100 మందికిపైగా వెనెజువెలా జాతీయులు ఈ విపత్తులో గల్లంతయ్యారు. జంట భూకంపాలు రావడానికి కొన్ని గంటల ముందే వారు అగ్రరాజ్యం నుంచి రావడం గమనార్హం.
సామూహిక డిపోర్టేషన్ డ్రైవ్‌లో భాగంగా బంధించిన 146 మంది వెనెజువెలా జాతీయులను అమెరికా ఇటీవల బహిష్కరించింది. వీరిలో 19 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారని హ్యూమన్ రైట్స్ ఫస్ట్ సంస్థ వెల్లడించింది. గత బుధవారం వారితో బయలుదేరిన విమానం మియామి (యూఎస్) నుంచి వెనెజువెలా రాజధాని కారకస్‌లో ల్యాండ్ అయింది. వారిని ఒక హోటల్లో ఉంచారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతంలో భూకంపం (Earthquake) వచ్చింది. ప్రకంపనల ధాటికి ఆ హోటల్ కూలిపోవడంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. వీరిలో దాదాపు 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
‘‘మేం ప్రాణాలతో ఎలా బయటపడ్డామో తెలియదు. సహాయం కోసం ఐదు కిలోమీటర్లు నడిచాం. ఆ అనూహ్య పరిస్థితికి ఏడుపు ఆగలేదు. ఎవరిని సంప్రదించాలో అర్థం కాలేదు’’ అని ప్రాణాలతో బయటపడిన లిస్బెత్ పొర్టిల్లో అనే మహిళ వాపోయారు. సహాయక సిబ్బందిని కలిసిన తర్వాత తన వారికి ఫోన్ చేయడానికి అవకాశం దొరికిందని చెప్పారు.
వెనెజువెలా (Venezuela) ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు 1700 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య భారీగా ఉంటుందన్న ఆందోళన నెలకొంది. సరైన సదుపాయాలు లేకపోవడంతో సహాయకచర్యలు మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటికే శిథిలాల కింద చిక్కుకున్న వారిని ప్రాణాలతో రక్షించే కీలక సమయం కూడా దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి 10వేల బాడీ బ్యాగ్‌లు (మృతదేహాలను ఉంచే కవర్స్) అందిస్తామని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.