
బెంగళూరు: భరణం విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తుంటే, కేవలం మహిళ అన్న కారణంతో ఆమె భరణం కోరడానికి వీల్లేదని తెలిపింది.
Jun 29 2026 7:19 PM | Updated on Jun 29 2026 7:43 PM
బెంగళూరు: భరణం విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తుంటే, కేవలం మహిళ అన్న కారణంతో ఆమె భరణం కోరడానికి వీల్లేదని తెలిపింది. భరణం మంజూరు చేసే విషయంలో లింగం ఆధారంగా నిర్ణయం తీసుకోవద్దని, ఇరువురి ఆర్థిక పరిస్థితులను పరిశీలించిన తర్వాతే ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
భర్తకు దూరంగా ఉంటున్న భార్యకు తాత్కాలిక భరణంగా నెలకు రూ.20,000 చొప్పున చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
వివాదం ఏమిటి? ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను భర్త కర్ణాటక హైకోర్టులో సవాలు చేశాడు. తన భార్య నెలకు సుమారు రూ.లక్ష సంపాదిస్తోందని, తన నెల జీతం రూ.60,646 మాత్రమేనని వాదించాడు. భార్య పరిస్థితి ఆర్థికంగా బాగుందని, ఆమెకు భరణం అవసరం లేదని తెలిపాడు. దీనిపై భార్య స్పందిస్తూ పెళ్లి ఖర్చుల వల్ల చేసిన అప్పులు తీర్చడానికి ఆ మొత్తం అవసరమని వాదించింది. అయితే, పెండింగ్‌లో ఉన్న అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలవారీ ఈఎంఐల వివరాలను అఫిడవిట్లో ఆమె వెల్లడించలేదు.
న్యాయస్థానం ఏమి చెప్పింది? న్యాయమూర్తి స్పందిస్తూ.. భర్త దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చి, తాత్కాలిక భరణం ఉత్తర్వులను రద్దు చేశారు. భర్తలే ఎప్పుడూ భార్యలను పోషించాలనే భావనతో కుటుంబ న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు పేర్కొంది.
"భార్య ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు, ఆమె ఆదాయం భర్త ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, పిల్లల సంరక్షణ వంటి ఇతర బాధ్యతలు ఆమెపై లేనప్పుడు.. మహిళలను పురుషులే పోషించాలనే కారణంతోగానీ, భార్యను భర్తే పోషించాలనే కారణంతోగానీ భరణం మంజూరు చేసేలా న్యాయస్థానాలు మొగ్గు చూపకూడదు" అని న్యాయస్థానం తెలిపింది.
భర్త జీవన ప్రమాణానికి సమానంగా తన జీవనాన్ని కొనసాగించడానికి భార్యకు సొంత ఆదాయం లేకపోతే మాత్రమే భరణం మంజూరు చేయాలని న్యాయస్థానం పేర్కొంది. భార్య నెల ఆదాయం రూ.లక్ష అని, అది భర్త జీతం కంటే ఎక్కువ అని, ఆమె తనను తాను పోషించుకునే సామర్థ్యం ఉన్న వ్యక్తి అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఈ తీర్పు ప్రస్తుతం సవాలు చేసిన ‘తాత్కాలిక భరణం’ ఉత్తర్వులకు మాత్రమే వర్తిస్తుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. వైవాహిక వివాదంపై తుది తీర్పుపై దీని ప్రభావం ఉండదని తెలిపింది. భవిష్యత్తులో పరిస్థితులు మారితే భార్యకు మరోసారి భరణం కోరే హక్కు ఉంటుందని కూడా పేర్కొంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు)
రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్.. ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
హ్యాపీ జర్నీ అంటున్న...నటి రూప శ్రీనివాస్ (ఫొటోలు)
#RAPO23 : సందడిగా రామ్ కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)
ఘట్కేసర్లో రెచ్చిపోయిన యువకులు.. వైరల్ వీడియో!
"ఇతను ఒక కోచేనా?".. Gautam Gambhirపై వైరల్ పోస్టు!
రైలు పట్టాలపై పడుకుని.. క్షణాల్లో మారిన పరిస్థితి!
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్ లొంగిపోయిన సాక్షులు...
కిల్లి రవి కేసు వెనుక అసలు కథ ఏంటి? పూర్తి వివరాలు!