ఐపీఎల్ 2026తో పాటు ఇటీవల జరిగిన ట్రై సిరీస్‌లోనూ అదరగొట్టిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడించకపోవడంపై టీమిండియా మేనేజ్మెంట్పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. బ్యాటర్ల దారు
ణ ప్రదర్శనతో చరిత్రలోనే తొలిసారిగా ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో విమర్శలు తీవ్రత మరింత ఎక్కువైంది. సూపర్ ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను ఆడించకపోవడంపై మాజీలు సైతం గుర్రుగా ఉన్నారు. ఇదే విషయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే మాట్లాడాడు. దీనిపై వివరణ ఇచ్చాడు.“వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అదే సమయంలో సంజూ శాంసన్ వంటి టీ20 ప్రపంచకప్ 2026 హీరో కూడా జట్టుతోపాటు ఉన్నాడు. ఐపీఎల్లో వీరిద్దరూ మెరుగైన ప్రదర్శన చేశారు. ఆటగాళ్లకు భరోసా ఇవ్వడంతోపాటు.. తమను తాము నిరూపించుకునేందుకు జట్టులో వారికి తగినంత సమయం కల్పిస్తామనే సందేశాన్ని అందించడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేం ముందుకు సాగుతాం” అని ర్యాన్ టెన్ డస్కాటే వివరించాడు.ఇదే సమయంలో వైభవ్.. ఎప్పుడు డెబ్యూ చేస్తాడనే విషయంపై కూడా మాట్లాడాడు. “మేం కూడా వైభవ్ సూర్యవంశీ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. కానీ అరంగేట్రం విషయంలో ఇతర ఆటగాళ్లకు ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో. వైభవ్‌కు కూడా అదే వర్తిస్తుంది. అతడి ఆటతీరుపై మేనేజ్మెంట్కు ఎలాంటి సందేహాలు లేవు” అని టెన్ డస్కాటే పేర్కొన్నాడు.కాగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 49 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1) విఫలమయ్యారు. రెండో మ్యాచ్‌లో ఓపెనర్లు సంజూ, అభిషేక్ శర్మ తాము ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరిపోయారు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ అనవసర పరుగు కోసం వెళ్లి 12 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. దీంతో వైభవ్ సూర్యవంశీకి.. జులై 1 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో తప్పకుండా ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.