వాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనాల మధ్య ప్రస్తుత పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ.. ఇంకా సున్నితంగానే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు.
అయితే, స్థిరత్వం అంటే అలసత్వం కాదని, ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టి, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయి సన్నద్ధతో సైన్యం మోహరింపు కొనసాగిస్తున్నామని ద్వివేది చెప్పారు. మంగళవారం పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపిస్తున్నాయని, ఇరు పక్షాలూ ఒకరి ఆందోళన పట్ల మరొకరు మరింత సానుకూలంగా స్పందిస్తున్నారని ఆర్మీ చీఫ్ వివరించారు.‘‘ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగా ఉన్నా అత్యంత సున్నితమై... సైన్యాల ఉపసంహరణ ఒప్పందం కారణంగా క్షేత్రస్థాయిలో స్థిరత్వం పెరిగింది.. ఏడాది కాలంగా పునరుద్దరించిన దౌత్య, సైనిక చర్చలు ఉద్రిక్తతలు తగ్గించడానికి, రోజువారీ సరిహద్దు నిర్వహణ సమస్యల పరిష్కారానికి, పరస్పర నమ్మకం పెంపొందించడానికి సహాయపడ్డాయి’’ అని ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకుంటున్నాయనడానికి పలు దౌత్యపరమైన చర్యలు సానుకూల ఫలితాలు ఇసతున్నాయని ఆర్మీ చీఫ్ అన్నారు. ‘‘వీటిలో సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పరిశీలనకు సంప్రదింపులు సమన్వయం కోసం పని చేసే యంత్రాంగం పరిధిలో ఒక నిపుణుల బృందం ఏర్పాటు, కైలాష్ మానససరోవర్ యాత్ర, నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ, మూడు కనుమలద్వారా సరిహద్దు వాణిజ్యానికి ఏకాభిప్రాయం, వీసా సడలింపు చర్యలు’’ ఉన్నాయని ఆయన చెప్పారు.‘‘ఇరుపక్షాల మధ్య ఏటా 1100 కంటే ఎక్కువ క్షేత్రస్థాయి చర్చలు జరుగుతాయి.. ఇవి హాట్లైన్లు, ఫ్లాగ్ మీటింగ్లు, కమాండర్ స్థాయి చర్చల ద్వారా స్థానిక సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతున్నాయి.. అయినప్పటికీ, భారత సైన్యం అలసత్వానికి తావివ్వడం లేదు.. కార్యాచరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర అనుబంధ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం’’ అని ఆయన స్పష్టం చేశారు.అయితే, భారత సైన్యం నిర్లక్ష్యంగా లేదని, కార్యాచరణ సవాళ్లను ఎదుర్కోవడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర అనుబంధ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. ‘‘స్థిరత్వం అంటే నిర్లక్ష్యం కాదు. ఎలాంటి ముప్పునైనా నివారించడానికి, ఏ ఆకస్మిక పరిస్థితికైనా స్పందించడానికి భారత సైన్యం పటిష్టమైన మోహరింపు స్థితిని కొనసాగిస్తోంది. ఉత్తర సరిహద్దుల వెంబడి మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిఘా, లాజిస్టిక్స్, మొబిలిటీ, సామర్థ్య పెంపు ప్రాధాన్యతగా ఉన్నాయి. సాధారణ సరిహద్దు నిర్వహణ నుంచి ఏదైనా కార్యాచరణ సవాలు వరకు మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన అన్నారు.