బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఈఠ’. మరాఠీ జానపద కళ వైభవాన్ని ప్రపంచానికి చాటిన ప్రముఖ లవాణి నృత్యకారిణి ‘విఠాబాయి నారాయణ్...
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఈఠ’. మరాఠీ జానపద కళ వైభవాన్ని ప్రపంచానికి చాటిన ప్రముఖ లవాణి నృత్యకారిణి ‘విఠాబాయి నారాయణ్ గావ్కర్’ జీవిత చరిత్ర ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో ఈ మూవీ టైటిల్ పై వివాదం చెలరేగింది. ‘ఈఠ’ టైటిల్‌పై కొందరు రాజకీయ నాయకులు, విఠాబాయి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పేరు ‘ఈఠ’ అని కాకుండా, విఠాబాయి నారాయణ్ గావ్కర్ పేరు మీదుగానే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్సీపీ సినిమా సాంస్కృతిక విభాగం (The Nationalist Congress Party Film and Cultural Department) ఈ టైటిల్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర గడ్డపై లవాణి సాంప్రదాయ కళకు ప్రాణం పోసి, భారత రాష్ట్రపతి నుంచి కూడా సత్కారాలు అందుకున్న విఠాబాయి గౌరవార్థం ఈ చిత్రానికి ‘విఠా’ లేదా ‘విఠాబాయి’ అనే పేరునే పెట్టాలని వారు సూచించింది. ఈ డిమాండ్‌కు విఠాబాయి కుటుంబ సభ్యులు కూడా మద్దతు ప్రకటించారు. మహారాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని, విఠాబాయి జీవితాన్ని వెండితెరపై ఎంతో మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా చూపించాల్సిన బాధ్యత చిత్రబృందంపై ఉందని ఎన్సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాబాసాహెబ్ పాటిల్ పేర్కొన్నారు. అయితే ‘ఈఠ’ టైటిల్ వివాదంపై దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కానీ, చిత్ర యూనిట్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. విఠాబాయి నారాయణ్ గావ్కర్ బయోపిక్ తెరకెక్కిస్తూ ఆమె పేరు కాకుండా, ‘ఈఠ’ అని టైటిల్ ఎందుకు పెట్టారో మేకర్స్ క్లారిటీ ఇస్తే వివాదం ముగిసి పోతుందని సినీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.‘ఛావా’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ - ప్రొడ్యూసర్ దినేష్ విజన్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం.. ‘స్త్రీ’ వంటి ఘన విజయం తర్వాత శ్రద్ధా కపూర్ - నిర్మాత దినేష్ విజన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ‘ఈఠ’ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్లో చూపించిన విఠాబాయి జీవితంలోని ఒక కీలక సన్నివేశం సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విఠాబాయి కుటుంబ సభ్యులు టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, దర్శక నిర్మాతలు ఎలాంటి ఎలాంటి పరిష్కారం చూపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.