
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Aeromart 2026: ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు మరోసారి హైదరాబాద్ వేదికగా నిలవనుంది. ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 కార్యక్రమం జూన్ 30 నుంచి జూలై 2 వరకు నగరంలో జరగనుంది. ఈ సదస్సులో ప్రపంచంలోని ప్రముఖ ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగాలకు చెందిన కంపెనీలు, తయారీ సంస్థలు, టెక్నాలజీ సంస్థలు, కొనుగోలు విభాగాల ప్రతినిధులు పాల్గొననున్నారు. భారతదేశంలో కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించడం, భాగస్వామ్యాలను పెంచుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఈ ఏడాది సదస్సుకు 25 దేశాల నుంచి 400కు పైగా సంస్థలు, 1200 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు భావిస్తున్నారు. మూడు రోజుల పాటు వేల సంఖ్యలో వ్యాపార సమావేశాలు నిర్వహించి కొత్త ఒప్పందాలు, పెట్టుబడులకు మార్గం సుగమం చేయనున్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచ ఏరోస్పేస్ తయారీ రంగంలో వేగంగా ఎదుగుతోంది. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ తయారీకి ప్రాధాన్యం ఇవ్వడం, రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం, పౌర విమానయాన రంగం విస్తరించడం వంటి కారణాలతో భారత కంపెనీలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్.. దేశంలోని కీలక ఏరోస్పేస్ కేంద్రంగా గుర్తింపు పొందింది. ఆధునిక తయారీ పరిశ్రమలు, నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, పరిశోధనా సంస్థలు, బలమైన పారిశ్రామిక వాతావరణం కలిసి తెలంగాణను ఈ రంగంలో ముందంజలో నిలిపాయి. తెలంగాణలో ప్రస్తుతం 25కు పైగా ప్రధాన ఏరోస్పేస్, రక్షణ సంస్థలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు వెయ్యికి పైగా ప్రత్యేక ఎంఎస్ఎంఈలు, నాలుగు ఏరోస్పేస్ పార్కులు, పరిశోధనా సంస్థలు, రక్షణ ప్రయోగశాలలు, విద్యాసంస్థలు కలిసి బలమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించాయి.
ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ కంపెనీలు కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. దీంతో విమాన భాగాల తయారీ, ఎంఆర్ఓ సేవలు, ఏవియానిక్స్, అధునాతన ఇంజనీరింగ్, కొత్త సాంకేతికతల అభివృద్ధికి హైదరాబాద్ కీలక కేంద్రంగా మారింది. ఈ సదస్సు ద్వారా భారతీయ కంపెనీలకు ప్రపంచ సంస్థలతో నేరుగా సమావేశమై తమ ఉత్పత్తులు, సామర్థ్యాలను పరిచయం చేసే అవకాశం లభిస్తుంది. అలాగే విదేశీ సంస్థలకు భారత సరఫరాదారులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఇది మంచి వేదికగా ఉపయోగపడనుంది.
వ్యాపార సమావేశాలతో పాటు ఏరోస్పేస్ రంగ భవిష్యత్తు, సరఫరా వ్యవస్థలు, డిజిటల్ టెక్నాలజీలు, ఆధునిక తయారీ విధానాలు, పరిశోధనలు, ఆవిష్కరణలపై ప్రత్యేక చర్చలు కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్వాన్స్డ్ బిజినెస్ ఈవెంట్స్, బీసీఐ ఏరోస్పేస్ సంస్థలు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రైజింగ్, టీజీఐఐసీ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సు ద్వారా తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు రావడంతో పాటు భారతదేశం ప్రపంచ ఏరోస్పేస్ తయారీ రంగంలో మరింత బలమైన స్థానాన్ని సంపాదిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.