India Bangladesh Tourist Visas : భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ప్రయాణ సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
బంగ్లాదేశ్‌లో 2024లో చోటుచేసుకున్న తీవ్ర రాజకీయ తిరుగుబాటు, ఆందోళనల నేపథ్యంలో నిలిపివేసిన పర్యాటక వీసాల జారీని పునరుద్ధరిస్తున్నట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్ పౌరులకు సాధారణ పర్యాటక వీసాలను జారీ చేయాలనే ఈ కీలక నిర్ణయం ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.నూతన హైకమిషనర్ దినేష్ త్రివేది సంచలన ప్రకటనఢాకాలో నూతనంగా నియమితులైన భారత హైకమిషనర్ దినేష్ త్రివేది ఈ రోజు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్‌ను బంగభవన్‌లో కలిసి తన అధికారిక పత్రాలను సమర్పించారు. అనంతరం జమున ఫ్యూచర్ పార్క్‌లోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ (ఐవీఏసీ)ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. "బంగ్లాదేశ్ పౌరుల కోసం జనరల్ ట్రావెల్ వీసాలను మళ్లీ పునఃప్రారంభిస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. జూన్ 28వ తేదీ నుంచే దరఖాస్తులను స్వీకరిస్తాం. మానవతా దృక్పథంతో అత్యవసర వైద్య వీసాల జారీ ఇదివరకు ఎలాగైతే కొనసాగిందో.. అలాగే ముందూ ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు. ప్రారంభంలో ఢాకా, రాజ్షాహి, చిట్టగాంగ్, సిల్హెట్, ఖుల్నా అనే ఐదు ప్రధాన కేంద్రాల ద్వారా ఈ వీసా సేవలను అందించనున్నారు.2024 ఆగస్టు 5వ తేదీన తలెత్తిన రాజకీయ సంక్షోభం తర్వాత బంగ్లాదేశ్‌లో తీవ్ర భద్రతా సమస్యలు తలెత్తాయి. ధన్మండిలోని ఇందిరా గాంధీ సాంస్కృతిక కేంద్రంపై దాడులు జరగడం, దానికి నిప్పు పెట్టడం, అలాగే ఐదు ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్లపై అల్లరి మూకలు దాడులు చేయడంతో భారత సిబ్బందికి భద్రతా ముప్పు ఏర్పడింది. దీంతో భారత్ తన వీసా సేవలను తాత్కాలికంగా పరిమితం చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ.. రోగుల అత్యవసర వైద్య చికిత్స అవసరాల కోసం మానవతా దృక్పథంతో రోజుకు 1500 కి పైగా నాన్ టూరిస్ట్ వీసాలను నిరంతరాయంగా అందజేస్తూనే వచ్చింది.సాధారణ స్థితికి చేరుతున్న ద్వైపాక్షిక బంధంఅవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ప్రయాణాలపై తీవ్రమైన ఆంక్షలు విధించడంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే గత కొన్ని నెలలుగా పరిస్థితులు వేగంగా మెరుగుపడుతున్నాయి. గతేడాది డిసెంబర్ 31వ తేదీన భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఢాకాలో పర్యటించారు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ప్రధాన మంత్రి తారిఖ్ రెహ్మాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రతిస్పందనగా భారత్‌లోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాలు కూడా భారతీయులకు అన్ని రకాల వీసాలను ఇప్పటికే పునరుద్ధరించాయి. తాజాగా భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరు సార్వభౌమ దేశాల మధ్య ఉన్న పాత స్నేహాన్ని మళ్లీ చిగురింపజేస్తోంది.