
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక సహాయకురాలు నటాలీ హార్ప్ గురించి తాజాగా విడుదలైన ఒక పుస్తకంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రజ్యోతి, జూన్ 28: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక సహాయకురాలు నటాలీ హార్ప్ గురించి తాజాగా విడుదలైన ఒక పుస్తకంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ కోసం చేతితో రాసిన చీటీలను ఆయన మాత్రమే ఉపయోగించే ప్రైవేట్ ప్రదేశాలలో నటాలీ హార్ప్ వదిలివెళ్లేవారని సదరు పుస్తకంలో రాసుకొచ్చారు. న్యూయార్క్ టైమ్స్ ప్రముఖ జర్నలిస్టులు మ్యాగీ హేబర్మన్, జోనాథన్ స్వాన్ రాసిన కొత్త పుస్తకం 'Regime Change: Inside the Imperial Presidency of Donald Trump'లో ఈ విషయాలను వెల్లడించారు.
వ్యక్తిగత ప్రదేశాలలో చీటీలు: నటాలీ హార్ప్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తనకున్న అమితమైన భక్తిని, నమ్మకాన్ని చాటుకుంటూ ఆయన ఉపయోగించే ప్రైవేట్ లేదా వ్యక్తిగత ప్రదేశాలలో (Personal Spaces) చేతితో రాసిన కొన్ని లేఖలను/చీటీలను వదిలివెళ్లేవారని రచయితలు సదరు పుస్తకంలో పేర్కొన్నారు. ఆమె ఉంచిన ఒక నోట్లో 'నాకు మీరే సర్వస్వం' అని రాసి ఉందని, మరో లేఖలో ట్రంప్‌ను తన 'రక్షకుడు'గా అభివర్ణించారని పుస్తకంలో రాశారు.
వైట్ హౌస్ స్పందన: అయితే, ఈ రాతలపై ట్రంప్ అంతర్గత బృందం, వైట్ హౌస్ ప్రతినిధులు స్పందిస్తూ, నటాలీ హార్ప్ వైట్ హౌస్‌లో అత్యంత కష్టపడి పనిచేసే నమ్మకమైన అధికారి అని, ఆమెపై వస్తున్న వార్తలు కేవలం 'ఫేక్ న్యూస్ మీడియా' సృష్టిస్తున్న ఆరోపణలు మాత్రమేనని కొట్టిపారేశారు. ఈ ఆరోపణలను వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ తీవ్రంగా తోసిపుచ్చారు. అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ తరహాలో సోషల్ మీడియాను విజయవంతంగా ఉపయోగించుకున్న అధ్యక్షుడు మరొకరు లేరని, ట్రంప్ సాంప్రదాయ వార్తా సంస్థలపై ఆధారపడకుండా, నేరుగా ప్రజలతో మాట్లాడటానికే ట్రూత్ సోషల్ ను ఉపయోగిస్తారని దేశాయ్ పేర్కొన్నారు. 'ఫేక్ న్యూస్ మీడియా తమను పక్కన పెట్టడాన్ని తట్టుకోలేకపోతోంది. కానీ అమెరికన్ ప్రజలు తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి నేరుగా విషయాలను తెలుసుకోవడాన్ని అభినందిస్తున్నారు' అని దేశాయ్ అన్నారు.
నటాలీ హార్ప్ గురించి మాట్లాడుతూ, ఆమె వైట్ హౌస్‌లో అందరి అభిమానాన్ని పొందిన ఒక ఉన్నతాధికారి అని, అంతటి నమ్మకాన్ని, గౌరవాన్ని సంపాదించుకోవడం ఎలాంటిదో ఈ ఫేక్ న్యూస్ మీడియాకు ఎప్పటికీ అర్థం కాదని దేశాయ్ స్పష్టం చేశారు. కాగా, 2024 ఎన్నికల్లో విజయం సాధించి, తిరిగి వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహిత బృందంలో ఒకరుగా నటాలీ హార్ప్ మారారు.
ట్రంప్ బృందంలో నటాలీ హార్ప్ అత్యంత నమ్మకమైన సభ్యురాలని, ఓవల్ ఆఫీస్‌లో దాదాపు ఎప్పుడూ ఆమె ట్రంప్ పక్కనే ఉంటుందని కూడా ఆ పుస్తకంలో వెల్లడించారు. పుస్తక రచయితల కథనం ప్రకారం, ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ ఉన్న సమయంలో హార్ప్ దాదాపు ఎప్పుడూ ఒక పక్కన కుర్చీలో కూర్చుని ఉండేది. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి, తల కొద్దిగా వంచి, అక్కడ జరిగే ప్రతి విషయాన్ని ఆమె నిశితంగా గమనించేది. అయితే, ట్రంప్ స్వయంగా ఆదేశిస్తే తప్ప ఆమె ఏనాడూ సొంతంగా చర్చల్లో జోక్యం చేసుకునేది కాదు అని కూడా ఆ పుస్తకంలో రచయితలు పేర్కొన్నారు.
మళ్లీ యుద్ధం మొదలవుతోందా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..