
భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
అయితే ఆ దేశ అత్యున్నత పురస్కారం అయిన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ గ్రీన్ గ్రోత్, సుస్థిర అభివృద్ధిలో మోదీ నాయకత్వానికి గుర్తింపునకు గానూ ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ అందజేశారు. ఇక ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా పోస్టు పెట్టారు. గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారాన్ని అందజేసినందుకు గానూ సీషెల్స్ ప్రజలు, ప్రభుత్వానికి, ఆ దేశ అధ్యక్షుడు హెర్మినీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ టైటిల్ ను నేను గౌరవంగా స్వీకరిస్తున్నాను. ఈ టైటిల్ ను క్లైమేట్ ఛేంజ్ కోసం పోరాడుతున్న అనేక దేశాలకు అంకితం చేస్తున్నాను. వాతావరణ మార్పును మనం తక్షణమే అధిగమించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు అన్ని దేశాలు ముందుకు రావాలి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఆహార భద్రత, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేసినందుకు గానూ ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ ఈ ఏడాది మే నెలలోనే మోదీకి ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ ను అందించిన విషయం తెలిసిందే. అంతకుముందు సియోల్ శాంతి బహుమతి, ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డులు ప్రధాని మోదీకి దక్కాయి.ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 27న సీషెల్స్‌ దేశ పర్యటనకు వెళ్లారు. 2015 తర్వాత ఈ దేశానికి ప్రధాని మోదీ వెళ్లడం ఇది రెండోసారి. ఈ దేశంలో మోదీ పర్యటన జూన్ 29 వరకూ జరుగుతుంది. సీషెల్స్ నేషనల్ డే గోల్డెన్ జూబ్లీలో గెస్ట్ ఆఫ్ ఆనర్‌ గా మోదీ పాల్గొన్నారు. ఈ మేరకు విక్టోరియా ఎయిర్‌ పోర్టులో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది.మరోవైపు ప్రధాని మోదీ 2014 లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 100 విదేశీ పర్యటనలను ఆయన పూర్తి చేశారు. ప్రధాని హోదాలో ఇప్పటివరకు 78 దేశాలను సందర్శించారు. 12 ఏళ్లలో దాదాపు 80 దేశాలు.. 100 ఫారిన్ ట్రిప్పులతో ప్రధాని మోదీ నయా రికార్డ్ నెలకొల్పారు.