
చకచకా కోడూరు-ముప్పవరం గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ఏడాదిలో అందుబాటులోకి వచ్చే అవకాశం 343 కి.మీ. ఆరు వరుసలుగా నిర్మాణం ఇప్పటికి దాదాపు 68 శాతం పూర్తి మార్కాపురం జిల్లా సీఎస్‌పురం మండలంలో ఎన్‌హెచ్-167బీ...
చకచకా కోడూరు-ముప్పవరం గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ఏడాదిలో అందుబాటులోకి వచ్చే అవకాశం 343 కి.మీ. ఆరు వరుసలుగా నిర్మాణం ఇప్పటికి దాదాపు 68 శాతం పూర్తి
మార్కాపురం జిల్లా సీఎస్‌పురం మండలంలో ఎన్‌హెచ్-167బీ హైవేను క్రాస్ చేసే చోట నిర్మిస్తున్న ఇంటర్ ఛేంజ్
ఈనాడు-కడప, పుట్టపర్తి, ఒంగోలు, అమరావతి: బెంగళూరు నుంచి రాజధాని అమరావతి, విజయవాడలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మిస్తున్న కోడూరు-ముప్పవరం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే-544జీ పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్, జులై నాటికి ఈ ఆరు వరుసల రహదారిపై వాహనాల రాకపోకలను ఆరంభించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను బెంగళూరు-కడప-విజయవాడ (బీకేవీ) ఎకనమిక్ కారిడార్‌గా ఎన్హెచ్ఏఐ పేర్కొంటోంది. అయితే.. బెంగళూరు నుంచి విజయవాడ వరకు నేరుగా ప్రత్యేక రోడ్డేమీ నిర్మించరు. బెంగళూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్‌కు సమీప కోడూరు వరకు.. ప్రస్తుతం ఉన్న బెంగళూరు-హైదరాబాద్ హైవేలో 110 కి.మీ. ప్రయాణించాలి. కోడూరు వద్ద యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే మొదలై.. 343.24 కి.మీ. కొనసాగి.. ప్రకాశం జిల్లాలోని ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా రహదారిలో కలుస్తుంది. అక్కడి నుంచి చెన్నై-కోల్‌కతా రహదారిలో 115 కి.మీ. ప్రయాణించి విజయవాడకు చేరుకోవాలి. అంటే మధ్య 342.24 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే ఉంటుంది. దానికి అటూఇటూ ఇప్పుడున్న హైవేల్లో 225 కి.మీ. ప్రయాణించాలి. ప్రస్తుతం బెంగళూరు-విజయవాడ మధ్య ప్రయాణ సమయం 12-13 గంటలు ఉండగా.. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 6-7 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రోడ్డును శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, నెల్లూరు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో నిర్మిస్తున్నారు. రూ.14 వేల కోట్ల నిర్మాణ వ్యయంతో భారతమాల పరియోజన మొదటి దశ కింద ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఈ పనులు జరుగుతున్న తీరును ‘ఈనాడు’ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
శ్రీసత్యసాయి జిల్లాలో నవాబుపేట నుంచి నల్లమాడ మధ్య పూర్తయిన రహదారి
వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట అటవీ ప్రాంతంలో సొరంగాల పనులు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.