
ఇంటర్నెట్ డెస్క్: లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో, శ్రద్ధా కపూర్ (shraddha kapoor) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఈథ’(eetha). ఈ సినిమా టీజర్ జూన్ 23న విడుదలై వివాదంలో చిక్కుకుంది.
మరాఠీ ‘లవాణి’ కళాకారిణి ‘విఠాబాయి నారాయణ్ గావ్కర్’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ టైటిల్‌పై రాజకీయపార్టీ ఎన్సీపీ, విఠాబాయి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్సీపీ సినిమా, సాంస్కృతిక విభాగం (The Nationalist Congress Party Film and Cultural Department) ‘ఈథ’ టైటిల్ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘సినిమాకు ‘విఠా’ లేదా ‘విఠాబాయి’ అని ఎందుకు పేరు పెట్టలేదు? విఠాబాయి మహారాష్ట్రకు చెందిన గొప్ప జానపద కళాకారిణి. ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె పేరు ఉండాలి.’’ అని సూచించింది. ఈ డిమాండ్‌కు విఠాబాయి కుటుంబం మద్దతు తెలిపింది. ‘విఠాబాయి జీవితాన్ని గౌరవంతో, మర్యాదగా చూపించే బాధ్యత మాది’ అని ఎన్సీపీ సినిమా, సాంస్కృతిక విభాగం మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు బాబాసాహెబ్ పాటిల్ అన్నారు. అయితే ఈ వివాదంపై దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.
1957, 1990లో భారత రాష్ట్రపతి నుంచి సత్కారం అందుకున్న విఠాబాయి, తరతరాలుగా లవాణి, తమాషా ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ‘ఈథ’ టీజర్లో ఆమె జీవితంలోని అత్యంత అద్భుతమైన ఓ సన్నివేశాన్ని చూపించారు. ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలో విడుదల కానుంది. ‘స్త్రీ’ సినిమా తర్వాత శ్రద్ధా కపూర్-దినేశ్ విజన్, ‘ఛావా’ హిట్ తర్వాత దినేశ్ విజన్- లక్ష్మణ్ ఉటేకర్ కాంబోగా ఈ సినిమా రావడం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.