layoffs: ప్రపంచ అనిశ్చితులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కారణాలతో దిగ్గజ కంపెనీలన్నీ వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. తాజాగా జర్మనీకి చెంది
న దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్ వ్యాగన్ (Volkswagen) భారీ మార్పులకు సన్నద్ధమవుతోంది. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతో పాటుగా ఏకంగా 4 ప్లాంట్లను మూసి వేయాలని ఆ కంపెనీ సీఈఓ ఒలివర్ బ్లూమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఈ మేరకు మేనేజర్ మ్యాగజైన్ తన కథనంలో వివరాలు పేర్కొంది. ఈ ప్రణాళికల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1 క్ష మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ చూస్తున్నట్లు తెలిపింది. అంటే ఆ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇది సుమారు 15 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ లో దాదాపు 6.67 లక్షల మంది పని చేస్తున్నారు. ఒక్క జర్మనీలోనే 43 శాతం మంది ఉద్యోగులు చేస్తున్నారు. ఒలివ్ బ్లూమ్ 2030 గ్రూప్ టార్గెట్ పిక్చర్ ప్రణాళికలో ఈ ఉద్యోగ కోతలు భాగమని మ్యాగజైన తెలిపింది. ఇటీవల ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మీటింగ్ లో ఈ ప్రతిపాదనలు ఉంచగా వచ్చే నెల జరిగే సూపర్ వైజరీ బోర్డులోనూ ఈ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. భారీగా ఉద్యోగులను తొలగించడంతో పాటు జర్మనీలోని హానోవర్, జ్విక్కావ్, ఎమ్డెన్, ఆడికి చెందిన నెక్సార్సల్మ్ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే 5 ఏళ్లలో పెట్టుబడుల ప్రణాళికలను సైతం 15 శాతం కుదించాలన్నది సీఈఓ ప్రణాళిక.ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అయ్యే ఖర్చులు, చైనా నుంచి ఎదురవుతున్న పోటీ, అంతర్జాతీయ టారిఫ్ ఒత్తిళ్లను తట్టుకునేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు సమాచారం. అయితే,ఈ ప్రతిపాదనలపై స్పందించిన ఫోక్స్ వ్యాగన్ వర్క్స్ కౌన్సిల్, జర్మనీ ఐజీ మెటల్ యూనియన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కంపెనీ ఇలాంటి చర్యలకు పాల్పడితే తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరికలు చేశాయి. మరోవైపు ఫోక్స్ వ్యాగన్ 50 వేల మందిని తొలగించాలని ప్రస్తుతం ప్రణాళికగా పెట్టుకుంది. దశాబ్దం పాటు ఏ ఒక్క ప్లాంటూను మూసి వేయమని 2024 కార్మిక సంఘాలతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజా ప్రణాళిక అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. దీంతో కార్మిక సంఘాల నుంచి భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. ఫోక్స్ వ్యాగన్ కంపెనీ ఫోక్స్ వ్యాగన్, ఆడి, ఫోర్షే, లాంబోర్గిని, బెంట్లీ వంటి పాసింజర్ వాహనాలతో పాటు, స్కానియా, డుకాటీ వంటి కమర్షియల్, టూ- వీలర్ ఆటో మొబైల్ బ్రాండ్లను నిర్వహిస్తోంది.