తిరుమల తిరుపతి దేవస్థానం మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. జూలై మూడో తేదీ నుంచి అక్షర గోవిందం కార్యక్రమం ప్రారంభించనుంది. చిన్నారు
లలో సనాతన ధర్మంపై ఆసక్తి పెంచటం, వారి విద్యాభ్యాసం శుభప్రదంగా సాగాలనే ఉద్దేశంతో అక్షర గోవిందం, అన్న ప్రాశన కార్యక్రమాలను జూలై మూడో తేదీ నుంచి టీటీడీ ప్రారంభించనుంది. తిరుపతిలోని వకుళామాత ఆలయంలో అక్షర గోవిందం , అన్నప్రాశన కార్యక్రమాలు ప్రారంభ కానున్నాయి. జూలై మూడో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకూ వకుళామాత ఆలయంలో సంప్రదాయబద్ధంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుంది. అక్షరాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఆశీర్వచనం, ప్రసాదం, ప్రత్యేకంగా రూపొందించిన అక్షర గోవిందం కిట్ టీటీడీ అందిస్తుంది. అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనేందుకు మూడు నుంచి ఐదేళ్లలోపు వయసు ఉన్న చిన్నారులు అర్హులు. ఇక అక్షరాభ్యాసం పూర్తయిన తర్వాత అందించే అక్షర గోవిందం కిట్‌లో టీటీడీ వివిధ వస్తువులను చేర్చింది. రాతపలక, బలపంతో పాటుగా శ్రీవారి అక్షింతలు, కంకణం, పసుపు, కుంకుమ, వకుళామాత, వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారు సరస్వతీ దేవి చిత్రపటాలు ఉంటాయి. అలాగే గోవిందనామాలు, శ్రీవారి సుప్రభాతం, పెద్దబాలశిక్ష వంటివి ఉచితంగా అందిస్తారు. అక్షరాభ్యాసంతో పాటుగా వకుళామాత ఆలయంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులకు అన్నప్రాశన కూడా నిర్వహిస్తారు. మరోవైపు అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు గంట ముందుగానే వకుళామాత ఆలయానికి చేరుకుని ఆలయ ప్రాంగణంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. అలాగే జూలై నాలుగో తేదీ నుంచి మంగళవారం మినహా మిగతా వారం రోజులూ వకుళామాత ఆలయంలో శుభ ముహూర్తంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రోజుకు 50 మంది చిన్నారులకు... బ్యాచ్‌కు 25 మంది చొప్పున రెండు బ్యాచులలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే అక్షర గోవిందం కార్యక్రమానికి హాజరయ్యే చిన్నారులు తల్లిదండ్రులు సంప్రదాయ వస్త్రధారణలో హాజరుకావాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది.