ప్రస్తుతం మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి అని చెప్పడానికి నిత్యం సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఉదాహరణగా మారుతున్నాయి. వివాహేతర సంబంధాలు.. పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి.
పురుషులు, మహిళలు అని తేడా లేకుండా భార్య, భర్తలతో ఉంటూనే.. ఇతరులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ వివాహేతర సంబంధాలు బయట పడటంతో.. హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. మరికొంతమంది ఎక్కడ తమ గుట్టు రట్టు అవుతుందనే భయంతో హత్యలు చేస్తున్నారు. మరికొందరు.. తమకు అడ్డుగా ఉన్నారని భార్యను భర్త.. భర్తను భార్య.. ప్రియుడు, ప్రియురాలితో కలిసి లేపేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. సొంత కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసిన అల్లుడిపై మోజు పడిన అత్త.. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. కట్టుకున్న భర్తనే హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భర్తను హత్య చేసిన తర్వాత తనకేమీ తెలియనట్లు నటించింది. అనారోగ్యంతో తన భర్త చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులను నమ్మించింది. తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో అమ్మపల్లి యాదయ్య, అలివేలు దంపతులు ఉన్నారు. అయితే వీరికి ఒక కుమార్తె ఉండగా.. ఆమెకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించారు. ఈ క్రమంలోనే కుమార్తె భర్తతో అలివేలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్తా భర్త యాదయ్యకు తెలిసింది. దీంతో వారిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని భయపడిన అలివేలు.. యాదయ్య మర్మాంగాలపై దాడి చేసి.. ఈనెల 23వ తేదీన హతమార్చింది. ఆ తర్వాత అతడు అనారోగ్యంతో చనిపోయాడని అందర్నీ నమ్మించింది. అలివేలు చెప్పింది నమ్మిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు.. యాదయ్య అంత్యక్రియలు చేపట్టారు. ఈ క్రమంలోనే యాదయ్య మృతదేహానికి స్నానం చేయించి, దుస్తులు మారుస్తుండగా అతడి శరీరంపై గాయాలు కనిపించాయి. దీంతో యాదయ్య అన్న కుమారుడు పరశురాములుకు అనుమానం వచ్చింది. యాదయ్యది హత్య అని భావించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అలివేలు ప్రవర్తన తేడాగా ఉండటంతో పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. తమ వివాహేతర సంబంధానికి భర్త యాదయ్య అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే అతని మర్మాంగాలపై దాడి చేసి హత్య చేసినట్లు భార్య అలివేలు పోలీసుల విచారణలో అంగీకరించింది. ఇక యాదయ్య హత్య జరిగిన అదే రోజు వారి కుమార్తె, అల్లుడు కూడా వారి ఇంటికి వచ్చి వెళ్లడంతో.. ఈ హత్యలో వారి పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.