Gold Falls: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరల్లో ఊహించని మార్పులు చూశాం. జూన్ 2026 నెల ప్రారంభం నుంచి చూసుకుంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇది కొనుగోలుదారులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు.
అయితే, చాలా మంది గోల్డ్, సిల్వర్ ఇన్వెస్టర్లకు ఇది అంత మంచి న్యూస్ కాదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, కొత్తగా బంగారం కొనేందుకు మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి వార్తగా చెబుతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX) మార్కెట్లో జూన్ 1వ తేదీ నుంచి చూసుకుంటే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.15,000 మేర పడిపోయింది. అంటే 9.73 శాతం మేర ధర దిగివచ్చింది. ఇదే క్రమంలో వెండి ధర సైతం భారీగా తగ్గింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ 26 రోజుల్లో చూసుకుంటే కిలో వెండి ధర 17 శాతంతో రూ.45,000 మేర దిగివచ్చింది. ఈ తక్కువ ధరల వద్ద పెట్టుబడి పెట్టడం కొత్త ఇన్వెస్టర్ల లబ్ధి చేకూర్చుతుందని చెప్పవచ్చు. ఈ పాయింట్ నుంచి మళ్లీ ధరలు పుంజుకున్నట్లయితే వారికి మంచి లాభాలు వస్తాయి. అయితే, ఇంకా ధరలు తగ్గేందుకు సైతం అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి ఏంటి? బంగారం, వెండి ధరలు ఇంకా తగ్గుతాయా? అనే వివరాలు తెలుసుకుందాం. ఈటీ వెల్త్ ఆన్లైన్ ప్రకారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చిన సంకేతాలతో గత వారం రోజుల్లో చూస్తే బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. వడ్డీ రేట్లను పెంచవచ్చని ఫెడ్ పాలసీమేకర్లు సూత్రప్రాయంగా వెల్లడించడంతో డాలర్ బాండ్ ఈల్డ్స్ పెరిగి బంగారం ధరలు దిగివచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. జనవరి, 2026లో ఆల్-టైమ్ హై నుంచి బంగారం ధర 29 శాతం మేర తగ్గి 4000 డాలర్ల స్థాయికి పడిపోయింది. అలాగే సిల్వర్ ధర 50 శాతానికి పైగా తగ్గి 57 డాలర్ల స్థాయికి వచ్చినట్లు గుర్తు చేశారు. ఇక ఎంసీఎక్స్ మార్కెట్ విషయానికి వస్తే ధరల తగ్గుదల ఆ స్థాయిలో కనిపించలేదు. బంగారం ధర 22 శాతం, వెండి ధర 49 శాతం మేర తగ్గింది. దిగుమతి సుంకాలు పెంచడంతో ధరలపై ప్రభావం పడింది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరల రికవరీ అనేది అమెరికా డాలర్ ధర, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ఉంటే ఈ రెండు లోహాలు క్రమంగా పుంజుకోవచ్చంటున్నారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు చూసుకుంటే 2026, జనవరిలోని ఆల్-టైమ్ గరిష్ఠాలతో పోలిస్తే భారీగా తగ్గాయి. ఇది ఓపికతో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మంచి అవకాశంగా చెబుతున్నారు. రూపాయి విలువ పుంజుకోవడంతో కొనుగోలు భారం కాస్త దిగివచ్చిందటున్నారు. అయితే, ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా క్రమానుగత పెట్టుబడి విధానాన్ని అవలంభించాలని కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం మంచిదంటున్నారు. అయితే, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఆందోళన చెందకుండా ఓపికతో ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ధరలు పడిపోతున్నాయన్న భయాలతో విక్రయించకూడదని చెబుతన్నారు. పేపర్ ధర మాత్రమే మారిందని, ఇది స్వల్పకాల మార్పు మాత్రమేనంటున్నారు. ధరలు భారీగా పడిపోయేందుకు ప్రాథమిక కారణాలు ఏమీ లేవని, ధరలు మళ్లీ పుంజుకుంటాయని సూచిస్తున్నారు.