ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు . కెరీర్ ప్రారంభంలో సపోర్టింగ్ రోల్స్ ఆయన, ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్నారు.
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందుడే విష్ణు.. చిన్న సినిమాలకు తనవంతు సపోర్ట్ అందిస్తుంటారు. ప్రమోషనల్ ఈవెంట్స్ కి గెస్టుగా వెళ్లడమే కాదు, సినిమా నచ్చితే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత కూడా తీసుకుంటారు. ఇప్పుడు ‘దీవాన’ సినిమాకి శ్రీవిష్ణు మద్దతుగా నిలిచారు. హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'దీవాన'. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్ సంగిశెట్టి అనే కొత్త దర్శకుడు ఈ లవ్ స్టోరీని తెరకెక్కించారు. వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, రఘు ఇతర పాత్రలు పోషించారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల ఓ వర్గం ప్రేక్షకులు ఈ సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది. తాజాగా ఈ మూవీ చూసిన శ్రీ విష్ణు.. చిత్ర బృందాన్ని అభినందించారు. శుక్రవారం నిర్వహించిన థ్యాంక్యూ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరై, సినిమా విశేషాలను పంచుకున్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ''ఈ సినిమాకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక ప్రేక్షకుడిగా వచ్చా. నిన్ననే సినిమా చూశా. నాకు చాలా బాగా నచ్చింది. మూవీలో ఝాన్సీ, నరేష్ మిగతా కాస్టింగ్ అంతా పర్పెక్ట్ గా కుదిరింది. డీవోపీ వర్క్, మ్యూజిక్ ఆకట్టుకుంది. ఇంటర్వెల్ పదిహేను నిమిషాల ముందు సినిమా ఒక జోన్ లోకి ఎంటర్ అయ్యింది. తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్ నేను చూడలేదు. అసలు ఏ సినిమాలోనూ చూడలేదు. ఇలా ఎందుకు చేశాడని డైరెక్టర్ మీద కోపం వచ్చింది. క్యారెక్టర్స్ మీద లవ్ ఉన్నప్పుడే మనకు కోపం వస్తుంటుంది'' అని అన్నారు. ''హర్షిత్ నటన, వాయిస్ అంటే నాకు ఇష్టం. సహజంగా నటిస్తాడు. ఇతనికి మంచి ప్రాజెక్ట్ పడితే పేరు తెచ్చుకుంటాడు అనిపించింది. ఇది లవ్ స్టోరీనే కాదు, లైఫ్ గురించి చాలా డెప్త్ ఉన్న స్టోరీ. ఎంతో ఎక్సిపీరియన్స్ చేస్తే గానీ ఇలాంటి డెప్త్ ఉన్న రైటింగ్ రాదు. సెకండాఫ్ ఎలా ఉంటుంది అనుకుంటూ మూవీ చూశా. పర్ ఫార్మెన్స్ లు అన్నీ బాగున్నాయి. సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి మనకొక ఫుల్ ఫిల్ నెస్ వస్తుంది. 'దీవాన' బ్యూటిఫుల్ ఫిలిం. ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. డైరెక్టర్ శ్రీకాంత్ కు మంచి టీమ్ దొరికింది. గీతా ఆర్ట్స్ దొరికింది. సినిమా బాగుందని అంటున్నారు'' అని శ్రీవిష్ణు అన్నారు. ఈ సినిమాకి తన సపోర్టుగా 1+1 టికెట్ ఆఫర్ ప్రకటించారు. ''నా వంతుగా దీవాన సినిమాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. రేపు శనివారం ఏపీ, తెలంగాణలో ప్రతి థియేటర్లో ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి, మరొక టికెట్ ఫ్రీగా ఇస్తున్నా. మీకు సినిమా నచ్చితే మరొకరిని థియేటర్స్ కు తీసుకెళ్లండి, లేదా సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టండి. అది 'దీవాన' సినిమాకు బూస్ట్ ఇస్తుంది. ఈ సినిమా నచ్చకుండా ఉండదు అనే కాన్ఫిడెన్స్ తో చెబుతున్నా. ఒకవేళ మీ టైమ్ వేస్ట్ అయ్యింది అనిపిస్తే చెప్పండి, నెక్ట్స్ నా సినిమా వచ్చినప్పుడు వడ్డీతో, చక్రవడ్డీతో, భూచక్ర వడ్డీతో కలిపి ఇచ్చేస్తా. ఇది యూత్ ఫుల్ మూవీ అనుకుంటాం. కానీ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. మీ ఫ్యామిలీని తీసుకెళ్తే ఇంకా బాగా నచ్చుతుంది. ఈ సినిమాను మరింతగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా'' అని శ్రీవిష్ణు అన్నారు.