
Volkswagen Job cuts | ఇంటర్నెట్ డెస్క్: జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) భారీ మార్పులకు సిద్ధమవుతోంది.
భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించడంతో పాటు, నాలుగు ప్లాంట్లను సైతం మూసివేయాలని కంపెనీ సీఈవో ఒలివర్ బ్లూమ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు మేనేజర్ మ్యాగజైన్ ఓ కథనం ప్రచురించింది. ఈ ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష ఉద్యోగాలను తొలగించాలని కంపెనీ చూస్తోంది. అంటే మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు 15 శాతానికి సమానం. ప్రస్తుతం ఫోక్స్ వ్యాగన్ గ్రూప్‌లో దాదాపు 6.67 లక్షల మంది పనిచేస్తున్నారు. ఒక్క జర్మనీలోనే 43 శాతం మంది పనిచేస్తున్నారు.
ఒలివ్ బ్లూమ్ ‘2030 గ్రూప్ టార్గెట్ పిక్చర్’ ప్రణాళికలో ఈ ఉద్యోగ కోతలు భాగమని సదరు మ్యాగజైన్ పేర్కొంది. ఇటీవల ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో ఈ ప్రతిపాదనలు ఉంచగా.. వచ్చే నెల జరిగే సూపర్వైజరీ బోర్డులోనూ ఈ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. భారీగా ఉద్యోగ కోతలతో పాటు జర్మనీలోని హానోవర్, జ్విక్కావ్, ఎమ్డెన్, ఆడికి చెందిన నెక్సార్సల్మ్ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఐదేళ్లలో పెట్టుబడుల ప్రణాళికలను సైతం 15 శాతం కుదించాలన్నది సీఈవో ప్రణాళిక.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అయ్యే భారీ ఖర్చులు, చైనా నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీ, అంతర్జాతీయ టారిఫ్‌ల ఒత్తిళ్లను తట్టుకోవడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనలపై స్పందించిన ఫోక్స్‌వ్యాగన్ వర్క్స్ కౌన్సిల్, జర్మనీకి చెందిన ఐజీ మెటల్ యూనియన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. యాజమాన్యం ఇలాంటి చర్యలకు పాల్పడితే తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించాయి. కాగా, ఫోక్స్‌వ్యాగన్ 50 వేల మందిని తొలగించాలని ప్రస్తుతం ప్రణాళికగా పెట్టుకుంది. దశాబ్దం పాటు ఏ ఒక్క ప్లాంటూ మూసివేయబోమంటూ 2024 కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకుంది. తాజా ప్రణాళిక అందుకు పూర్తి విరుద్ధంగా ఉండడంతో కార్మిక సంఘాల నుంచి భారీ స్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఫోక్స్‌వ్యాగన్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్, ఆడి, పోర్షే, లాంబోర్గిని, బెంట్లీ వంటి పాసింజర్ వాహనాలతో పాటు, స్కానియా, డుకాటీ వంటి కమర్షియల్, టూవీలర్ ఆటోమొబైల్ బ్రాండ్లను నిర్వహిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.