అమ్మా, నాన్న అని పిలిపించుకోవాలని ప్రతి జంటా కోరుకుంటుంది. కానీ మారుతున్న జీవన శైలి, తీసుకుంటున్న ఆహారం, పెరుగుతున్న ఒత్తిడి.. కారణాలేమైతేనేం..
సంతానం లేని దంపతులు ఎందరో నేటి సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. మనోళ్లలో ఉంటారు.. మన చుట్టూ ఉన్నవారిలో ఉంటారు. ఆర్థికంగా కాస్త స్థితిమంతులైతే.. సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. కానీ పేద, మధ్యతరగతి దంపతుల పరిస్థితి ఏమిటి.. ప్రైవేట్ సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్లాలంటే పైసలతో పని.. అలాగని పిల్లలు కావాలనే కోరికను చంపుకోవాలా.. అమ్మా నాన్న అని పిలిపించుకోవాలనే ఆశకు దూరం కావాల్సిందేనా.. అయితే అలాంటి అవసరం ఇప్పుడు లేదంటున్నాయి విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రి వర్గాలు.. విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) చికిత్స అందుబాటులోకి తెచ్చారు. అత్యాధునిక పద్ధతులతో కూడిన ఈ చికిత్సను ఉచితంగా అందిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులలోనే ఉన్న ఈ ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ చికిత్సను ఇప్పుడు విశాఖ కేజీహెచ్‌లో సైతం అందుబాటులోకి తెచ్చారు. ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ ప్రక్రియలో మహిళ గర్భాశయంలోకి వీర్యకణాలు ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ తొలిదశలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్న మహిళలో అండాల ఉత్పత్తిని పెంచేందుకు మందులు ఇస్తారు. ఆ తర్వాత అల్ట్రా సౌండ్ టెస్టుల ద్వారా అండం ఎలా ఎదుగుతోందనే విషయాన్ని పర్యవేక్షిస్తారు. ఎప్పుడు విడుదల అవుతుందనే సమయాన్ని నిర్ధారించుకుంటారు.అలాగే పురుషుడి నుంచి సేకరించిన వీర్యాన్ని ల్యాబ్‌లో శుద్ధి చేస్తారు. ఈ శుద్ధి చేసిన వీర్యకణాలను కాథెటర్ సహాయంతో అండం విడుదలయ్యే సమయానికి అనుగుణంగా మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇదంతా కేవలం నిమిషాల్లోనే పూర్తవుతుందని వైద్యులు చెప్తున్నారు. సంతానలేమి సమస్యలతో ఇబ్బంది పడే దంపతులు ఈ చికిత్సను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ విజయవంతమయ్యే అవకాశాలు సదరు మహిళ వయసు, ఆరోగ్యం.. అలాగే అండాలు, వీర్యకణాల నాణ్యతపైనా ఆధారపడి ఉంటుందని వైాద్యులు చెప్తున్నారు. అత్యాధునిక చికిత్స విధానం అందుబాటులోకి రావటంపై విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.