
రామమందిర విరాళాల దుర్వినియోగం కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ట్రస్ట్ చీఫ్ చంపత్‌రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేశారు.ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అరెస్టైన వారిలో నగదు లెక్కింపు సిబ్బంది, లెక్కింపు ప్రక్రియ ఇన్‌ఛార్జి, పర్యవేక్షించిన రిటైర్డ్ బ్యాంకర్‌తో పాటు చంపత్‌రాయ్ డ్రైవర్, సన్నిహితుడు రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ కూడా ఉన్నారు.ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రాథమిక నివేదిక ఆధారంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనంతరం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై చోరీ, నమ్మకద్రోహం, మోసం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.