
AP High Court: భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనుకుంటే, చట్టప్రకారం నిర్దేశించిన ఆరు నెలల ‘కూలింగ్ పీరియడ్’ (వేచి ఉండే సమయం) తప్పనిసరి కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది
AP High Court landmark verdict stating that a six-month cooling-off period is not required for divorce
AP High Court: భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనుకుంటే, చట్టప్రకారం నిర్దేశించిన ఆరు నెలల ‘కూలింగ్ పీరియడ్’ (వేచి ఉండే సమయం) తప్పనిసరి కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. వివాదాలు పూర్తిగా ముదిరిపోయి, దంపతులు రాజీపడే అవకాశం లేదని భావించినప్పుడు ఈ సమయాన్ని మినహాయించవచ్చన్న సుప్రీంకోర్టు గత తీర్పులను హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13బీ(2) ప్రకారం ఆలోచించుకోవడానికి సమయం ఇచ్చినప్పటికీ, కలిసి జీవించే మార్గం లేనప్పుడు అనవసరంగా వేచి ఉండమనడం వారిని మానసిక వేదనకు గురిచేయడమేనని కోర్టు అభిప్రాయపడింది.
Sanjay Jaju: తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఒక దంపతుల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది జనవరిలో వారు పరస్పర అంగీకారంతో విడాకుల కోసం ఒంగోలు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఆస్తి పంపిణీ, కుమార్తె సంరక్షణ, భరణం, క్రిమినల్ కేసుల ఉపసంహరణ వంటి అన్ని విషయాలపై వారిద్దరూ ఒక అవగాహనకు వచ్చారు. అయితే, ఫ్యామిలీ కోర్టు ఆరు నెలల కూలింగ్ పీరియడ్ తప్పనిసరి అంటూ వారి దరఖాస్తును వాయిదా వేసింది. దీనిని సవాల్ చేస్తూ సదరు దంపతులు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు(AP High Court), ఒంగోలు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. దంపతుల మధ్య అన్ని వివాదాలు ముగిసిపోయి, విడిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు కూలింగ్ పీరియడ్ మినహాయించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని స్పష్టం చేసింది. భార్యాభర్తలు సమర్పించిన అనుబంధ పిటిషన్ను తక్షణమే పరిగణనలోకి తీసుకుని, సాధ్యమైనంత త్వరగా వారి విడాకుల దరఖాస్తుపై తగిన తుది ఉత్తర్వులు జారీ చేయాలని ఒంగోలు ఫ్యామిలీ కోర్టును ఏపీ హైకోర్టు ఆదేశించింది.