జ్ఞాన దంతాలు లేదా విస్డమ్ టీత్ (Wisdom teeth) అని పిలిచే ఇవి మన నోట్లోని చివరి దంతాలు (Third molars). ఇవి సాధారణంగా 17 నుంచి 25 సంవత్సరాల వయస్సు మధ్యలో వస్తాయి. చాలా మందికి ఇవి ఎలాంటి ఇబ్బంది
లేకుండా సాధారణంగానే వస్తాయి, కానీ కొంతమందిలో ఇవి చిగుళ్లలోనే ఇరుక్కుపోవడం, సగం మాత్రమే బయటకు రావడం, లేదా వంకరగా రావడం జరుగుతుంది. దీనివల్ల నోటి ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి.కొంతమందికి ఈ దంతం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. తీవ్రమైన నొప్పిని ఎదుర్కొంటారు. దీంతో తొలగించాలని భావిస్తారు. జ్ఞాన దంతాల సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలి, గుర్తించాల్సిన లక్షణాలు, చికిత్స విధానం గురించి డాక్టర్ సింధు యు ముక్తమఠ్ (HOD - డెంటల్ సైన్స్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) పూర్తి వివరాలు అందించారు.గుర్తించాల్సిన ముఖ్య లక్షణాలు డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, జ్ఞాన దంతాల సమస్య మొదలైందని చెప్పడానికి కొన్ని ప్రాథమిక సంకేతాలు లేదా లక్షణాలు ఇవే. నోటి వెనుక భాగంలో స్థిరంగా నొప్పి లేదా ఒత్తిడి అనిపించడం. చిగుళ్లు వాపు రావడం, తాకితే నొప్పిగా ఉండటం. నోరు పూర్తిగా తెరవడానికి ఇబ్బంది పడటం. ఆహారం నమలేటప్పుడు నొప్పి రావడం. నోటి దుర్వాసన లేదా నోట్లో చేదు రుచి రావడం (సగం వచ్చిన దంతాల దగ్గర ఇన్ఫెక్షన్ల వల్ల ఇది జరుగుతుంది). తలనొప్పి, దవడ నొప్పి, ముఖం వాపు రావడం. పక్కనే ఉన్న ఇతర దంతాలు ఒకదానికొకటి నొక్కుకుపోవడంకొన్నిసార్లు లక్షణాలు లేకుండానే ప్రమాదం కొన్నిసార్లు జ్ఞాన దంతాలు ఎలాంటి నొప్పి లేదా స్పష్టమైన లక్షణాలు లేకుండానే లోపల్లోపల నష్టాన్ని కలిగిస్తాయి. చిగుళ్లలో ఇరుక్కుపోయిన దంతాల వల్ల అక్కడ సిస్ట్లు (నీటి బుడగలు - Cysts) ఏర్పడటం, దవడ ఎముక బలహీనపడటం లేదా పక్కనే ఉన్న దంతాలు పాడైపోవడం జరగొచ్చు. అందుకే రెగ్యులర్ డెంటల్ చెకప్‌లు, ఎక్స్-రేలు (X-rays) తీయించుకోవడం చాలా అవసరం.చికిత్స విధానం దంతాన్ని తొలగించాల్సి వస్తే, ఆ పంటి యొక్క స్థానం, పరిస్థితిని బట్టి డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. సాధారణ పద్ధతి: పూర్తిగా బయటకు వచ్చిన దంతాన్ని సులభంగానే తొలగించవచ్చు. చిన్న సర్జరీ: లోపల ఇరుక్కుపోయిన దంతాల కోసం చిన్న నోటి సర్జరీ అవసరమవుతుంది. దీనికోసం లోకల్ అనస్థీషియా (ఆ భాగాన్ని మొద్దుబార్చడం) ఇస్తారు. అవసరమైతే కొద్దిగా చిగురును కట్ చేసి పంటిని తీసివేసి, త్వరగా మానడానికి కుట్లు (Stitches) వేస్తారు. సర్జరీ జరిగిన రోజే రోగి ఇంటికి వెళ్ళిపోవచ్చు.సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు సర్జరీ తర్వాత కోలుకోవడానికి కొన్ని రోజుల నుంచి ఒక వారం సమయం పడుతుంది. ప్రారంభంలో స్వల్ప వాపు, అసౌకర్యం, దవడ కదపడం కష్టం కావడం సహజం. డాక్టర్లు సూచించే జాగ్రత్తలు: వాపు తగ్గడానికి ఐస్ ప్యాక్స్ (Ice packs) పెట్టాలి. డాక్టర్ ఇచ్చిన మందుల్ని సమయానికి వాడాలి. బాగా నీళ్లు తాగాలి. కేవలం మెత్తటి ఆహారాలు (Soft foods) మాత్రమే తినాలి.చేయకూడని పనులు సర్జరీ అయిన వెంటనే ధూమపానం చేయడం, స్ట్రాతో జ్యూస్‌లు తాగడం, గట్టిగా ఉమ్మడం లేదా పుక్కిలించడం, కష్టమైన పనులు చేయడం పూర్తిగా మానేయాలి. లేకపోతే 'డ్రై సాకెట్' (Dry socket) అనే తీవ్రమైన నొప్పిని కలిగించే సమస్య వచ్చే ప్రమాదం ఉంది. పంటిని తొలగించినప్పుడు ఆ ఖాళీ ప్రదేశంలో రక్తం గడ్డకట్టి ఎముకను, నరాల్ని కాపాడుతుంది. కానీ మనం గట్టిగా పుక్కిలించినా లేదా స్ట్రాతో జ్యూస్ తాగినా ఆ ఒత్తిడికి ఆ రక్తం గడ్డ తొలగిపోతుంది. దీనివల్ల లోపలి ఎముక బయటకు కనిపిస్తూ తీవ్రమైన నొప్పి పుడుతుంది. దీనినే 'డ్రై సాకెట్' అంటారు. ప్రతి జ్ఞాన దంతాన్ని తీసేయాల్సిన అవసరం లేదు. కానీ స్థిరమైన నొప్పి, పదే పదే ఇన్ఫెక్షన్లు రావడం, పక్క పళ్లకు నష్టం జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే డెంటిస్ట్‌ను సంప్రదించడం మంచిది.సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులుడాక్టర్ సింధు యు ముక్తమఠ్ (HOD - డెంటల్ సైన్స్, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్)