
Apple price hike | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ తన మ్యాక్‌బుక్ (MacBook), ఐప్యాడ్ (iPad) ధరలను భారీగా పెంచేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల విస్తరణ కారణంగా మార్కెట్లో మెమొరీ, స్టోరేజ్ భాగాలకు డిమాండ్ విపరీతంగా పెరిగి వాటి ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. యాపిల్ ఉత్పత్తుల ధరల పెంపు తప్పదంటూ యాపిల్ సీఈవో వ్యాఖ్యానించిన కొద్ది రోజులకే కంపెనీ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
తాజా పెంపు నిర్ణయంతో మ్యాక్‌బుక్ నియో ఎంట్రీ లెవల్ మోడల్ ధర 599 డాలర్ల నుంచి 699 డాలర్లకు పెరిగింది. మ్యాక్‌బుక్ ఎయిర్ 512 జీబీ వేరియంట్ ధర 1099 డాలర్ల నుంచి 1299 డాలర్లకు; మ్యాక్‌బుక్ ప్రో 1టీబీ వేరియంట్ ధర 1699 డాలర్ల నుంచి 1999 డాలర్లకు పెరిగింది. ఇక ఐప్యాడ్ ఎయిర్ 128జీబీ వేరియంట్ 599 డాలర్ల నుంచి 749 డాలర్లకు, ఐప్యాడ్ ప్రో వైఫై 256జీబీ వేరియంట్ ధర 999 డాలర్ల నుంచి 1199 డాలర్లకు పెరిగింది. ధరల సవరణ నేపథ్యంలో యాపిల్ వెబ్సైట్ కాసేపు అంతరాయం ఏర్పడింది. (గమనిక: భారత మార్కెట్లో ధరలు వెలువడాల్సి ఉంది)
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కొత్త సవాలును ఎదుర్కొంటోందని యాపిల్ ఓ ప్రకటనలో ఏర్కొంది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణ కారణంగా మెమొరీ, స్టోరేజీలకు ఎక్కడా లేని డిమాండ్ డిమాండ్ ఏర్పడిందని, ఎప్పుడూ ఈ స్థాయిలో ధరల పెరుగుదల చూడలేదని కంపెనీ పేర్కొంది. దీంతో తమ ఉత్పత్తుల ధరలు పెంచాల్సిన సమయం ఆసన్నమైందని యాపిల్ పేర్కొంది. భవిష్యత్‌లో మరింత పెంచే అవకాశం ఉండొచ్చన్న సంకేతాలు ఇచ్చింది. గడిచిన 40 ఏళ్లలో ఇలాంటి విడిభాగాల ధరల పెరుగుదలను తానెప్పుడూ చూడలేదని యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇటీవల వ్యాఖ్యానించారు. వినియోగదారులపై ఈ భారాన్ని మోపడం తప్ప మరో మార్గం లేదని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.