
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ (Amazon CEO Andy Jassy) గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
ఈ క్రమంలో ఏఐ, క్లౌడ్ సేవలను భారత్‌లో భారీగా విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రానున్న 5 ఏళ్లలో అదనంగా 13 బిలియన్ డాలర్ల (రూ.1.22 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఆరు నెలల క్రితం దేశంలో 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని అమెజాన్ వెల్లడించగా..తాజా ప్రకటనతో తమ మొత్తం పెట్టుబడి ప్రణాళికలు 48 బిలియన్ డాలర్లకు (రూ.4.53 లక్షల కోట్లు) చేరాయని అమెజాన్ సీఈవో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా మోదీతో కలిసిన ఫొటోలను పంచుకున్నారు.
‘‘భారత్‌లో దీర్ఘకాల వాణిజ్యానికి అమెజాన్ కట్టుబడి ఉంది. 2030 నాటికి ఏఐ, క్లౌడ్ సేవలను భారీగా విస్తరించనుంది. ఇందుకోసం 48 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాం. 2030 నాటికి 38 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాం. 80 బిలియన్ డాలర్ల ఇ-కామర్స్ ఎగుమతులను సృష్టిస్తాం. 1.5 కోట్ల మిలియన్ చిన్న వ్యాపారులకు, 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలను అందిస్తాం’’ అని ఆండీ జెస్సీ ఎక్స్ వేదికగా తెలిపారు.
‘‘హైదరాబాద్, ముంబయిలోని ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ల విస్తరణకు ఈ పెట్టుబడులు ఉపయోగించనున్నాం. దీని వల్ల భారత్‌లోని స్టార్టప్‌లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఏఐ, క్లౌడ్ సేవలను అందిస్తాం’’ అని అమెజాన్ పేర్కొంది. అమెజాన్ భారీ పెట్టుబడులను మోదీ స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఆండీ జెస్సీతో గొప్ప భేటీ జరిగింది. భారత్‌లో అమెజాన్ పెట్టుబడులను స్వాగతిస్తున్నాం. దీంతో యువతకు కొత్త అవకాశాలు ఏర్పడుతాయి. భారత్‌లో పెట్టుబడులకు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం’’ అని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.