ITR Filing: ఉద్యోగం మారడం అనేది కెరీర్ వృద్ధికి మంచిదే అయినప్పటికీ, ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయడం విషయంలో మాత్రం అది పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండు వేరు వేరు కంపెనీల్లో పని చేసిన ఉద్యోగులు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు తెలియక ఒక సాధారణ తప్పు చేస్తుంటారు. దీనివల్ల పన్ను ఎగవేత జరిగినట్లు తేలి, ఆదాయపు పన్ను శాఖ నుంచి ట్యాక్స్ డిమాండ్ నోటీసు జారీ అవుతుంది. అసలు ఆ తప్పు ఏంటి? దాన్ని ఎలా అధిగమించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఒక వ్యక్తి పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి మారినప్పుడు రెండు కంపెనీలు కూడా విడివిడిగా ఆ ఉద్యోగికి ఫామ్ 16 జారీ చేస్తాయి. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. రెండు కంపెనీలు కూడా తమ పరిధిలో పన్నును లెక్కించేటప్పుడు ఆదాయపు పన్ను చట్టం కల్పించే ప్రాథమిక మినహాయింపులను ఆ ఉద్యోగికి విడివిడిగా వర్తింపజేస్తాయి. స్టాండర్డ్ డిడక్షన్ అనేది పాత పన్ను విధానంలో రూ.50 వేలు, కొత్త పన్ను విధానంలో రు.75 వేల వరకు ఉంటుంది. పాత కంపెనీ దీనిపై డిడ7న్ ఇస్తుంది. అలాగే కొత్త కంపెనీ సైతం అంతే మొత్తాన్ని మినహాయిస్తుంది. అలాగే సెక్షన్ 80సీ మినహాయింపులు రెండు కంపెనీలు సైతం విడివిడిగా గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు మినహాయింపును లెక్కించి టీడీఎస్ కట్ చేస్తాయి. కానీ, ట్యాక్స్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ ప్రాథమిక మినహాయింపులు లభిస్తాయి. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో రెండు కంపెనీల ఆదాయాన్ని కలిపి చూపించినా, ఈ డబుల్ డిడక్షన్ ను సరిచేయకపోతే ట్యాక్స్ తక్కువ చూపించినట్లు అవుతుంది.ట్యాక్స్ నోటీసు ఎందుకు వస్తుంది?మీరు ఐటీఆర్ సబ్మిట్ చేసినప్పుడు ఐటీ శాఖ వద్ద ఉండే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS), ఫామ్ 26ఏఎస్ లలోని డేటాతో మీ ఐటీఆర్ ను ఆటోమేటిక్ గా స్క్రీనింగ్ చేస్తారు. మీ రెండు ఫామ్ 16లలో డబుల్ డిడక్షన్స్ ఉండి, మీరు ఐటీఆర్ లో అదనపు పన్ను చెల్లించకపోతే సిస్టమ్ వెంటనే దానిని గుర్తించి, పన్ను వ్యత్యాసం ఉన్నట్లు చూపిస్తూ సెక్షన్ 143 (1) కింద నోటీసు పంపిస్తుంది.నోటీసు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారి ఉంటే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పాత కంపెనీ ఇచ్చిన ఫామ్ 16, కొత్త కంపెనీ ఇచ్చిన ఫామ్ 16 రెండింటినీ పరిశీలించాలి. మీ రెండు కంపెనీల గ్రాస్ శాలరీని కలిపి మొత్తం ఆదాయంగా ఐటీఆర్ లో నమోదు చేయాలి. మీ మొత్తం ఆదాయం నుంచి కేవలం ఒకే ఒక స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని మాత్రమే మినహాయించాలి. రెండుసార్లు క్లెయిమ్ చేయవద్దు. రెండు ఆదాయలు కలిపినప్పుడు హయ్యర్ ట్యాక్స్ స్లాబ్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీని వల్ల పాత కంపెనీలు కట్ చేసిన టీడీఎస్ కాకుండా అదనంగా కొంత పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఆ బ్యాలెన్స్ ట్యాక్స్ నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. ఆ చలానా వివరాలను ఐటీఆర్ లో నమోదు చేయాలి.