
హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు 70 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది.
ఇక ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమై ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది(2026) అంటే 72 వ సంవత్సరం 69 అడుగుల ఎత్తులో "పంచముఖ సంకటహర మహాగణపతి" గా ఖైరతాబాద్ బడా గణేశ్ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ మేరకు తాజాగా ఉత్సవ కమిటీ నమూనా పోస్టర్ ను ఆవిష్కరించింది.
పంచముఖ సంకటహర మహాగణపతికి ఓవైపు సోమనాథ్ జ్యోతిర్లింగం ఉండనుంది. అలాగే మరోవైపు కాళీమాతా విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి పండగ జరగనుంది. అనంతరం 11 రోజులపాటు ఘనంగా గణేష్ నవరాత్రులను నిర్వహించనున్నారు. ఇక ఇవాళ కర్ర పూజతో విగ్రహ తయారీ అధికారికంగా ప్రారంభం కావడంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. ఖైరతాబాద్ లో ప్రతి ఏడాది విగ్రహాన్ని సరికొత్తగా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.
గతేడాది 2025 లో 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఆ సమయంలో స్వామి వారికి కుడి పక్కన శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీసమేత హయగ్రీవ స్వామి వారు ఉండగా.. ఇక ఎడమవైపు లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి అమ్మవార్లు కొలువుదీరి ఉన్నారు. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణేశ్ ను దర్శించుకునేందుకు వస్తుంటారు.
ప్రతియేటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉండటం విశేషం. ఎప్పుడో 1954 లో అప్పటి ప్రముఖ స్వాతంత్ర్య సమయయోధుడు బాల గంగాధర్ తిలక్ స్పూర్తితో ఒక్క అడుగుతో ఖైరతాబాద్ లో గణేశ్ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. అలా ఒక్కో అడుగు పెరుగుతూ ఈ ఏడాదికి 72 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఎత్తు సైతం 69 అడుగులకు చేరుకుంది.