
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
తుంగభద్రలో మన నీటి వాటాకు తూట్లు పొడిచే పనికి రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఆర్డీఎస్ చుట్టూ కర్ణాటక చేపట్టే ప్రాజెక్టులతో తెలంగాణ నీటి హక్కును కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. మన హక్కులను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి కర్ణాటక దోపిడీకి వంత పాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ మీద నిర్మించి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వెళ్లవద్దని సూచించారు.
తుంగభద్ర నీటి వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తుండడంతో మాజీ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ వీడియో సందేశం విడుదల చేశారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని రేవంత్ రెడ్డికి సూచించారు. కేంద్ర జల సంఘం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు.
'తెలంగాణ సాధించుకొని 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మనం పూర్తిస్థాయిలో కృష్ణా, తుంగభద్రలో మన నీటిని వాడుకోలేదు. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ నడిగడ్డను బతికించి ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు ఉపయోగపడే ప్రాజెక్ట్. ఆర్డీఎస్లో మనకు 16 టీఎంసీల వాటా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చిన తర్వాత గానీ 6 టీఎంసీల కన్నా ఎక్కువ వాడుకోలేదు. మన నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేందుకు ఆర్డీఎస్ చుట్టుపక్కల రిజర్వాయర్లను బలోపేతం చేయాల్సి ఉంది' అని మాజీ ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నడిగడ్డకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
'తెలంగాణకు ఆర్డీఎస్లో 16 టీఎంసీలు వచ్చినట్లే ఏపీకి సుంకేశుల నుంచి 16 టీఎంసీల వాటా ఉంది. కానీ వాళ్లు దాన్ని 32 టీఎంసీలు చేసుకోని బీభత్సంగా నీటిని వాడుకుంటున్నారు. మనం మాత్రం ఆ పని చేయలేదు. మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు కట్టుకునేలోపే కర్ణాటక తుంగభద్ర మీద మూడు ప్రాజెక్టులు కడుతోంది. కురిడి, కల్పగల్ గ్రామాల్లో 2 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మిస్తోంది ఆర్డీఎస్కు 15 కిలోమీటర్ ఎగువన చిక్కాలపర్వి వద్ద 2.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజ్ నిర్మిస్తోంది. ఆర్డీఎస్కు దిగువన రాయిచూరు జిల్లాలోని చిక్క మంచాల సమీపంలో 5 టీఎంసీల కెపాసిటీతో మరో బ్యారేజి నిర్మిస్తోంది. మొత్తంగా ఆర్డీఎస్కు ఎగువన, దిగువ 10 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా కర్ణాటక ప్రాజెక్టులు చేపడుతోంది' అని కవిత వివరించారు.
'వాస్తవానికి కర్ణాటకకు ఆర్డీఎస్లో 1.20 టీఎంసీ వాటా నీళ్లు మాత్రమే ఉన్నాయి. కానీ పది టీఎంసీల నీళ్లు వినియోగించుకునే ప్రయత్న చేస్తోంది. అలాంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి వెళ్లి చంద్రబాబు, డీకే శివకుమార్లను కూర్చొబెట్టుకుని తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. కర్ణాటక ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే తుంగభద్రలో మన వాటా హక్కును పర్మినెంట్‌గా కోల్పోతాం' అని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.
'కాంగ్రెస్ పార్టీ మళ్లీ మీరు అధికారంలోకి రాదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై చర్యలు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రే మా ప్రాజెక్టులకు అంగీకారం తెలిపారని కర్ణాటక వాదిస్తుంది. రేవంత్ రెడ్డి చేసే ఈ పని నడిగడ్డ ప్రజలకు అతిపెద్ద గుదిబండగా మారుతుంది' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కేంద్ర జల సంఘం దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి కేంద్రంతో మన నీటి వాటా హక్కుల కోసం పోరాడుదామని.. కృష్ణా, తుంగభద్రలో మన వాటాను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి శాశ్వతంగా తాగు, సాగు నీరు వచ్చేలా చేసుకుందామని సూచించారు.