
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఏటీఎం సొమ్ముతో డ్రైవర్ పరారైన ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కుమారుడితో కలిసి డ్రైవర్ శ్రీనివాస్ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఐఎస్ సదన్ పీఎస్ పరిధిలో ఈ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ముందస్తు ప్రణాళికతోనే రూ.17లక్షల నగదు చోరీ చేసి తండ్రీకొడుకులు బైక్‌పై పరారైనట్లు తేల్చారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఉప్పుగూడలోని మరో కుమారుడికి శ్రీనివాస్ కొంత నగదు అందించినట్లు గుర్తించారు.
కొద్దినెలల క్రితమే ఏటీఎంలలో నగదు అమర్చే ఏజెన్సీ సంస్థలో శ్రీనివాస్ డ్రైవర్‌గా చేరాడు. అప్పుల బాధతో చోరీకి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. జగిత్యాల సమీపంలో అత్తగారి ఇంటి వద్ద నిందితుడిని పట్టుకున్నట్లు సమాచారం. శ్రీనివాస్‌తో పాటు ఇద్దరు కుమారులనూ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. నగదు రికవరీ, కుట్రపై దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలో పోలీసు అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశముంది.
ఐఎస్ సదన్ పరిధిలో డబ్బు అమర్చే ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది కలీం అ¸నే వ్యక్తి పర్యవేక్షణలో రూ.30లక్షల నగదున్న బ్యాగులతో 3 ఏటీఎంలలో డబ్బును అమర్చారు. ఈది బజార్ వికాస్ పాఠశాల ఎదురుగా ఏటీఎంలో అమర్చేందుకు ఏజెన్సీ సిబ్బంది ఏటీఎం గదిలోకి వెళ్లారు. వాహనంలో డ్రైవర్ శ్రీనివాస్ మాత్రమే ఉన్నాడు. దీంతో అతడు రూ.17 లక్షలున్న బ్యాగ్‌ను తీసుకుని బైక్‌పై పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే కలీం ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. నిఘా కెమెరాల్లో దృశ్యాలు, నిందితుడి కాల్ లిస్టు పరిశీలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కుమారుడితో కలిసి శ్రీనివాస్ బైక్‌పై పక్కా ప్రణాళికతో పరారైనట్లు గుర్తించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.