
ఇంటర్నెట్డెస్క్: తీవ్ర భూకంపంతో వెనెజువెలా (Venezuela Earthquakes) చిగురుటాకులా వణికిపోయింది. బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి.
మృతుల సంఖ్య 10వేల నుంచి లక్ష వరకు ఉండొచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) అంచనా వేస్తోంది. వెనెజువెలా భూకంపాలకు గురవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇక్కడ భారీ భూకంపాలు సంభవించాయి. అయితే, ఇంత తీవ్ర స్థాయిలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడం శతాబ్దకాలంలో ఇదే తొలిసారని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ దేశంలో తరచూ భూకంపాలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయి?
వెనెజువెలాలో తరచూ సంభవించే భూకంపాలకు కారణాలు తెలియాలంటే.. ముందుగా దాని భౌగోళిక స్వరూపం అర్థం కావాలి. ఈ దేశం దక్షిణ అమెరికా ఖండానికి ఉత్తర తీరంలో ఉంటుంది. ప్రధాన భూభాగమంతా దక్షిణ అమెరికా ప్లేట్ (ఫలకం)పైనే ఉన్నప్పటికీ.. ఉత్తర భాగం మాత్రం కరేబియన్ దీవులకు దగ్గరగా ఉంటుంది. ఈ దీవులన్నీ కరేబియన్ ప్లేట్ (ఫలకం)పై ఉన్నాయి. అవి ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయి. ఏడాదికి కనీసం 20 మి.మీ మేర దక్షిణ అమెరికా ఫలకం వైపు దూసుకొస్తున్నాయి. ఫలితంగా ఆ రెండు ప్లేట్స్ మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడి భూకంపాలకు దారి తీస్తోంది. అంతేకాకుండా దాదాపు 80 శాతం మంది వెనెజువెలా ప్రజలు భూకంపం సంభావ్యత ఎక్కువగా ఉన్న జోన్లలోనే నివసిస్తున్నారు. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతోంది.
వెనెజువెలాలో భూ ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండటానికి మరో కారణం భూకంప కేంద్రాలు. భూ ఫలకాల కదలిక ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కడో ఒకచోట చిన్నపాటి భూకంపాలు వస్తునే ఉంటాయి. భూకంప కేంద్రం లోతు ఎక్కువగా ఉంటే.. ఉపరితలంపై దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. లోతు తగ్గుతున్న కొద్దీ.. తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అయితే, వెనెజువెలాలో మాత్రం భూకంప కేంద్రాలు ఎక్కువగా 15 నుంచి 20 కి.మీ లోతులోనే నమోదవుతున్నాయి. దీంతో ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండి.. భారీగా నష్టం వాటిల్లుతోంది.
భూకంపాలు సంభవించి.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన ప్రతిసారీ ‘టెక్టోనిక్ ప్లేట్స్’ అనే పదం వినిపిస్తుంది. ఇంతకీ ఏంటీ టెక్టోనిక్ ప్లేట్స్ అంటే.. భూ గ్రహం వాస్తవానికి భారీ రాతి ఫలకాలుగా విడిపోయి ఉంది. వాటినే టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు. ఇవి చిన్నా పెద్దా కలిసి 15 వరకు ఉన్నాయి. ఇవి.. భూమి అడుగున ఉండే మాంటిల్ అనే ద్రవరూప పొరపై తేలుతూ ఉంటాయి. ఇవి స్థిరంగా ఒక చోట ఉండవు.. నిరంతరం కదులుతూ.. ఒకదాన్నొకటి ఢీ కొట్టుకుంటాయి. అయితే, ఇవి కదులుతున్నాయన్న సంగతిని సాధారణంగా మనం గుర్తించలేం. కానీ, వీటి కదలికలు నెమ్మదిగా సాగినప్పటికీ.. చాలా ప్రభావవంతమైనవి. కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ ప్రకియ సాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కీలక భౌగోళిక మార్పులు చోటు చేసుకున్నాయి. పర్వతాలు ఏర్పడటానికి కూడా ఈ కదలికలే కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
వెనెజువెలా దేశంలో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తు తీవ్రతకు ఆ దేశ రాజధానిలో తీవ్ర నష్టం వాటిల్లింది. పలు బహుళ అంతస్తు భవనాలు కుప్పకూలాయి. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఆ ఫొటోలు..