రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతాంగానికి మరింత మెరుగైన విద్యుత్ సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు డిస్కం ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
ఈ నూతన విద్యుత్ పంపిణీ సంస్థ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు అత్యంత కీలకమైన లైసెన్స్ జారీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ERC) ఈ లైసెన్స్ జారీకి అవసరమైన విధివిధానాలపై ప్రస్తుతం తుది కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేకంగా ఒక డిస్కం కలిగిన రాష్ట్రంగా ఇది చరిత్ర సృష్టించనుంది.కొత్తగా ఏర్పడనున్న రైతు డిస్కంకు అధికారిక హోదా దక్కాలంటే ఈఆర్సీ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో లైసెన్స్ మంజూరు కోసం రైతు డిస్కం ప్రతినిధులు గత మార్చి 19వ తేదీన దరఖాస్తు సమర్పించారు. నిబంధనల ప్రకారం నూతన సంస్థ ఏర్పాటుపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ఈఆర్సీ ఆహ్వానించింది. ఇందులో భాగంగా మే 29వ తేదీన ఒక బహిరంగ విచారణ కూడా నిర్వహించింది. ఈ విచారణలో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలకు ఉపక్రమించింది.రైతు డిస్కంను కొత్తగా ఏర్పాటు చేయాలంటే.. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ పంపిణీ బాధ్యతలు చూస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (SPDCL)ల లైసెన్సుల్లో పలు మార్పులు చేయాల్సి ఉంటుంది. వాటి అధికార పరిధిని సవరించడానికి సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు కోరుతూ ఈఆర్సీ గత నెల 23న ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది. అభ్యంతరాలు, సూచనలు సమర్పించేందుకు ఈ నెల 22 వరకు ఇచ్చిన గడువు ముగిసింది. ఈ ప్రక్రియలో మొత్తం నాలుగు అభ్యంతరాలు, మరికొన్ని సూచనలు ఈఆర్సీకి అందినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం అధికారులు వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలన పూర్తయిన వెంటనే రైతు డిస్కం ఏర్పాటుకు అవసరమైన లైసెన్స్‌ను మంజూరు చేస్తూ ఈఆర్సీ తుది ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.లైసెన్స్ మంజూరుతో పాటు ప్రస్తుత డిస్కంల పరిధిలో కీలక మార్పులు జరగనున్నాయి. సాధారణ గృహ, వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లు మినహాయించి ప్రభుత్వ సబ్సిడీలతో నడిచే పలు కనెక్షన్లను కొత్త సంస్థకు బదిలీ చేస్తారు. వాటిల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో పాటు భారీ, మధ్యతరహా ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన కనెక్షన్లు, ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథ ప్రాజెక్టు పంప్‌హౌస్‌లు, ఇతర ప్రభుత్వ, మున్సిపల్ తాగునీటి సరఫరా పథకాల కనెక్షన్లు ఉండనున్నాయి. ఈ కనెక్షన్లన్నింటినీ ప్రస్తుతమున్న రెండు డిస్కంల పరిధి నుంచి పూర్తిగా తొలగించి వాటిని రైతు డిస్కం పరిధిలోకి మారుస్తారు. ఈ బదిలీ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఈఆర్సీ లైసెన్స్ జారీ చేస్తేనే.. ఈ కనెక్షన్లకు నిరంతర విద్యుత్ సరఫరా చేసే చట్టబద్ధమైన అధికారం రైతు డిస్కంకు లభిస్తుంది. దీనివల్ల సాధారణ డిస్కంలపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు, రైతులకు విద్యుత్ సరఫరాలో నాణ్యత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.