భారత పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభలో తెలంగాణ ప్రజాప్రతినిధుల హవా నడుస్తోంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) దేశవ్యాప్తంగా ఉన్న 226 మంది
సిట్టింగ్ రాజ్యసభ ఎంపీల ఆర్థిక, నేర, ఇతర నేపథ్యాలపై తాజాగా విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం రాజ్యసభ సభ్యుల ఆస్తులతో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ఎంపీల వాటాయే ఏకంగా 39.39 శాతంగా నమోదైంది. ఈ మొత్తం సంపదలోనూ ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ ఎంపీల ఆస్తులే ఎక్కువ. మొత్తం 226 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.26,047 కోట్లు కాగా.. అందులో కేవలం తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల సంపదే ఏకంగా రూ.8,310 కోట్లుగా ఉంది. అంటే దేశవ్యాప్త ఎంపీల మొత్తం ఆస్తిలో దాదాపు మూడో వంతు వాటా తెలంగాణ ప్రజాప్రతినిధులదే కావడం గమనార్హం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.1,949 కోట్లుగా ఉంది. నివేదిక ప్రకారం తెలంగాణలో 57 శాతం మంది, ఆంధ్రప్రదేశ్‌లో 45 శాతం మంది ఎంపీలు బిలియనీర్లుగా తేలారు.టాప్-3లో ఇద్దరు తెలంగాణ వారే..రాజ్యసభలో అత్యధిక ఆస్తులున్న తొలి ముగ్గురు ఎంపీలను పరిశీలిస్తే.. అందులో ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే కావడం విశేషం. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న బండి పార్థసారథి రూ.5,300 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక రాజ్యసభ ఎంపీగా మొదటి స్థానంలో నిలిచారు. పంజాబ్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజేందర్ గుప్తా రూ.5,053 కోట్లతో రెండో స్థానంలో నిలవగా.. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ రూ.2,558 కోట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. తెలంగాణలో కేవలం ముగ్గురు బీఆర్ఎస్ సభ్యుల ఆస్తి విలువే రూ.5,524 కోట్లుగా ఉందని ఏడీఆర్ స్పష్టం చేసింది.నేర చరితలోనూ తెలంగాణే ఫస్ట్..క్రిమినల్ కేసులు ఉన్న ఎంపీల జాబితాలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. తెలంగాణకు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో ముగ్గురిపై అత్యంత తీవ్రమైన నేరాల కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఈ కేసుల పరంగా దేశంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల కంటే తెలంగాణే ముందంజలో ఉంది. తెలంగాణలో క్రిమినల్ కేసులున్న వారిలో బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు.పార్టీల వారీగా ఆస్తుల వివరాలు..దేశవ్యాప్తంగా వంద కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్న ఎంపీలు 31 మంది ఉండగా.. అందులో బీజేపీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ నుంచి ఇద్దరేసి, జనసేన నుంచి ఒకరు ఈ వంద కోట్ల క్లబ్లో ఉన్నారు. పార్టీల పరంగా చూస్తే.. దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీల ఆస్తుల విలువ రూ.8,181 కోట్లు కాగా.. కాంగ్రెస్ సభ్యులది రూ.3,781 కోట్లుగా ఉంది. నలుగురు స్వతంత్రులకు రూ.2,211 కోట్ల ఆస్తులున్నాయి. ఏపీలో తెదేపాకు చెందిన నలుగురు ఎంపీల ఆస్తుల విలువ రూ.1,007 కోట్లు కాగా.. వైసీపీకి చెందిన నలుగురు సభ్యులకు రూ.683 కోట్ల విలువైన ఆస్తులున్నాయి.అప్పుల విషయానికి వస్తే.. రాజ్యసభలో అత్యధిక అప్పులున్న తొలి ముగ్గురు ఎంపీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ రూ.200 కోట్ల అప్పులతో రెండో స్థానంలో నిలిచారు. ఆయన మెుత్తం ఆస్తులు రూ.672 కోట్లు. ఝార్ఖండ్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ పరిమళ్‌నత్వానీ రూ.256 కోట్ల అప్పులతో మొదటి స్థానంలో.. జయాబచ్చన్ రూ.149 కోట్ల అప్పులతో మూడో స్థానంలో ఉన్నారు. కాగా, మొత్తం రాజ్యసభ సభ్యుల్లో మహిళల వాటా కేవలం 15 శాతం అంటే 34 మంది మాత్రమే ఉన్నారని.. అందులోనూ బీజేపీ నుంచి 20 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి నలుగురు ఉన్నట్లు ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది.