
హైదరాబాద్: ప్రస్తుతం తాను గర్భిణి అన్న విషయాన్ని అగ్ర కథానాయిక సమంత (Samantha) ధ్రువీకరించారు. ఈ క్రమంలో సినిమాలకు కాస్త విరామం తీసుకుంటున్నట్లు తెలిపారు.
దీంతో గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న వార్తలకు (samantha pregnancy news) స్పష్టత ఇచ్చినట్లు అయింది. సామ్ కీలక పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.50కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చాలా కాలం తర్వాత సమంత కమ్ బ్యాక్ మూవీగా అలరించింది.
బుధవారం నిర్వహించిన థాంక్స్ మీట్లో సమంత, రాజ్ నిడిమోరు, నందినీరెడ్డి, శ్రీముఖి, దిగంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను గర్భిణి అన్న విషయాన్ని ధ్రువీకరించడంతో పాటు, ప్రస్తుతం మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానన్నారు. సినిమాలకు ఈ ఒక్క విరామం తీసుకుని, మళ్లీ అభిమానుల ముందుకు వస్తానని తెలిపారు.
‘‘రిస్క్ తీసుకోకపోతే, ఒక సర్కిల్లో పరిమితం అయిపోతాం. ఇలాంటి పాత్ర చేయడం నిజంగా ఒక ఛాలెంజ్. ఈ విషయంలో మా టీమ్ చాలా సహకరించింది. అందుకే నా వంతు బెస్ట్ ఇవ్వగలిగాను. ఇక చిరంజీవి గారు ప్రశంసించడం మాకు పెద్ద ప్రోత్సాహం. మా టీమ్‌తో గంటకుపైగా మాట్లాడారు. మన కెరీర్ మన చేతిలో ఉంటుంది. కొన్ని రిలేషన్‌షిప్‌లు సంక్లిష్టంగా ఉంటాయి. అవి మన చేతుల్లో ఉండవు. ఇద్దరి చేతుల్లో ఉంటాయి. ఒక మహిళకు తనపై తనకు నమ్మకం ఉండాలి. అప్పుడే సరైన వ్యక్తిని గుర్తించగలదు. లేకపోతే, తప్పులు జరుగుతాయి. రిలేషన్షిప్లో ఉన్న వాళ్లకు నేను ఒక సలహా ఇస్తున్నా. ఎదుటి వ్యక్తి మీకు సంపూర్ణత్వం తీసుకురావాలని చూడకండి. మొదట మిమ్మల్ని మీరు పరిపూర్ణ వ్యక్తిగా మార్చుకోండి. ఒకప్పుడు నేను నటించిన సినిమాలు ఏడాదికి మూడు వచ్చేవి. అలాంటిది నా ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో మూడేళ్లు విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా నాకు బోనస్. లేడీ సూపర్‌స్టార్ నయనతార. నేను కేవలం సమంత. నా చుట్టు పక్కన ఉన్న మహిళలు నాలో స్ఫూర్తినింపుతూ వచ్చారు’’ అని సమంత అన్నారు.
ఈ సందర్భంగా ఈ స్టోరీ క్రియేటర్ రాజ్ నిడిమోరు మాట్లాడారు. ‘‘ఫ్యామిలీమ్యాన్’, ‘స్త్రీ’ ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అయితే, ఈ సినిమాకు వచ్చిన ప్రశంసలు ఏ మూవీకి రాలేదు. ఇది చాలా స్పెషల్. ఈ సినిమా విషయంలో కాస్త ఒత్తిడి ఉంది. అనుకున్న బడ్జెట్లో వేగంగా మూవీ తీద్దామనుకుని రంగంలోకి దిగాం. షూటింగ్ కూడా చేశాం. నేను డైరెక్ట్ చేయకుండా నందినీ రెడ్డికి ఇవ్వడం వెనుక కారణం కూడా ఉంది. సిరీస్‌లు చేసే కొద్దీ పాత్రలు మారిపోతూ ఉంటాయి. అందుకే క్రియేటర్ అని పెట్టుకుంటాం. మేము కొన్ని, ఇంకొన్ని వేరే వాళ్లు దర్శకత్వం వహిస్తారు. ఇందులో కూడా టీమ్ వర్క్‌గా చేశాం. సినిమా ఆసాంతం ఆమెతో కలిసి పనిచేశా. చాలా సున్నితంగా డిజైన్ చేసి, తీసుకురావాల్సిన జర్నీ ఇది. ఈ విషయంలో నందిని పర్ఫెక్ట్ పార్ట్నర్. కమర్షియల్ సినిమాల్లో లాజిక్‌లు పక్కన పెట్టేయొచ్చు. అలా ఆలోచించే నేను, డీకే స్క్రిప్ట్‌లు రాసుకుంటాం’’ అని రాజ్ అన్నారు. ‘ఓ బేబీ’తో పోలిస్తే, సమంత ఇందులో పూర్తిగా భిన్నంగా కనిపించారని, ‘ఫ్యామిలీమ్యాన్’ నుంచి సమంతలో ఆ మార్పు వచ్చిందని దర్శకురాలు నందినీ రెడ్డి అన్నారు. అదే ఈ సినిమాలోనూ కనిపించిందని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.