
దిల్లీ: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వచ్చే నెలలో జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దౌత్య వర్గాలు బుధవారం వెల్లడించాయి. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటనేదీ రాలేదు.
జులై 5 నుంచి 9 వరకు ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. తొలుత టెహ్రాన్, ఖోమ్ పట్టణాల్లో అంతిమ సంస్కారాలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు. 9వ తేదీన ఖమేనీ స్వస్థలం మషాద్‌లో ఆయనను ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ (Iran)పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ప్రారంభమైన తొలి రోజే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిపిన దాడిలో 86 ఏళ్ల అలీ ఖమేనీ, మరో 40 మంది అత్యున్నత సైనికాధికారులు మృతి చెందారు. ఖమేనీ కుటుంబంలో కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మృతి చెందగా.. కుమారుడు మొజ్తాబా కూడా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. అలీ ఖమేనీ మరణంతో.. మొజ్తాబాను సుప్రీం లీడర్‌గా ఎన్నుకొన్న సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.