
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Ketan Agarwal Murder Case: లోహగడ్ కోట.. ఎత్తైన లోయలు.. ప్రకృతి అందాలు.. పర్యాటకుల మనస్సులు దోచుకుంటాయి. కానీ జూన్ 18న అదే కోటసాక్షీగా ఒక హత్యకు కారణమైంది. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ కేతన్ అగర్వాల్ ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించాడంటూ వచ్చిన వార్త అందర్నీ నమ్మించింది. కానీ.. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేని అక్కకు మదిలో ఎన్నో అనుమానాలు. అక్కకు వచ్చిన ఒక చిన్న డౌట్.. సీన్ కట్ చేస్తే.. అసలు నిజం బయటపడింది. ఈ హత్యకేసులో బయటపడిన డిజిటల్ ఆధారలు దేశాన్నే కుదిపివేసిన ఒక కన్నింగ్ ప్రేమకథ, ద్రోహం, మర్డర్ స్టోరీని వెలుగులోకి తెచ్చాయి.
అనుకోని ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్ ప్రకారమే: జూన్ 18వ తేదీన అసలు ఏం జరిగిందంటే.. కేతన్ అగర్వాల్ తన కాబోయే భార్య.. సియా గోయల్ తో కలిసి లోహగడ్ కోటకు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. అక్కడ ఫొటోలు తీసుకుంటున్న సమయంలో కేతన్ కాలు జారీ లోయలో పడిపోయాడు. తీవ్ర గాయాలతో మరణించాడంటూ సియా గోయల్ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమె రోధన చూసిన వారంతా అయ్యో పాపం నిజమే అనుకున్నారు. లోనావాలా రూరల్ పోలీసులు కూడా అదే నమ్మారు. ప్రాథమికంగా దీన్ని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగానే భావించి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేతన్ అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. ఈ కథ అక్కడితోనే ముగిసిపోవాల్సింది.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ షురూ అయ్యింది.
తమ్ముడి మరణాన్ని తట్టుకోలేని అక్క.. గుండెలు పగిలేలా ఏడుస్తూనే ఉంది. కానీ ఆమెకు ఏదో చిన్న అనుమానం. ఎన్నో సందేహాలు. తన తమ్ముడి మరణం ఎలా అనే ప్రశ్నలు. ఒక ప్రమాదమని చెబుతున్న ఆ కథలో ఆమెకు ఎన్నో డౌట్లు వచ్చాయి. తమ్ముడు మరణించిన 4 రోజులు తర్వాత .. తనను ఓదార్చేందుకు తమ ఇంటికి వచ్చిన సియాను ఆమె లోహగడ్ లో అసలేం జరిగిందో చెప్పమని అడిగింది. మే 31వ తేదీ నుంచి జూన్ 18వ తేదీ మధ్య 3 సార్లు అక్కడికి ఎందుకు వెళ్లావు.. అని అడిగిన ప్రశ్నకు సియా ఇచ్చిన సమాధానం అనుమానం కలిగేలా చేసింది. సియా మాటలు దాటవేసింది. అది గ్రహించిన ఆమె వెంటనే కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పింది. వారు మొదట్లో అంగీకరించలేదు. ప్రమాదమే అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులను ఒప్పించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హుడీ వెనకే అసలు మిస్టరీ: కుటుంబ సభ్యుల ఫిర్యాదు.. ఒత్తిడితో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. లోహగడ్ కోట పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీలను జల్లెడ పట్టారు. జూన్ నెల మండుటెండలో.. ముఖానికి మాస్క్ ధరించి.. ఒళ్లంతా కప్పుకున్న హుడీ ధరించిన ఓ వ్యక్తి కేతన్, సియాల కదలికలను అనసరిస్తూ కనిపించాడు. ఆ వేషధారణ పోలీసులకు అనుమానం కలిగేలా చేసింది. సాంకేతిక ఆధారాల సాయంతో ఆ వ్యక్తి సియా లవర్ చేతన్ చౌదరిగా గుర్తించారు. పోలీసులు సియా, చేతన్ లను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించారు. అప్పుడే అసలు దారుణం బయటకు వచ్చింది. సియా, చేతన్ 3ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో వారు ఏకంగా 2,004 సార్లు ఫోన్ మాట్లాడుకున్నారు. దాదాపు 238గంటలు సాధారణ కాల్స్ తో పాటు ఫేస్ టైమ్, వాట్సాప్ ద్వారా టచ్ లో ఉన్నారు.
ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. కేతన్ మర్డర్: సియాకు చేతన్ తో ఉన్న సంబంధం గురించి గోయల్ ఫ్యామిలీకి ముందే తెలుసు. అయినా కూడా సవ్యంగానే సాగుతుందన్న నమ్మకంతో కేతన్ తో నిశ్చితార్థం జరిపించారు. సియా కూడా ఎంతో సంతోషంగా నవ్వుతూ వారితో కలిసిపోయింది. కానీ ఆమె మనసులో మాత్రం కేతన్ ను ఎలాగైనా వదిలించుకోవాలని డిసైడ్ అయ్యింది. చేతన్ తో కలిసి స్కెచ్ వేసింది. పక్కా ప్లాన్ తోనే 3 సార్లు లోహగడ్ కోట చుట్టూ చక్కర్లు కొట్టారు. జూన్ 18న అనుకూల సమయం చూసి.. లోయ నుంచి కేతన్ ను కిందికి తోసేసి చంపేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా సినిమా స్టైల్ కథను అల్లారు. కేతన్ అక్కకు ఏ చిన్న అనుమానం రాకున్నా ఈ హత్య ఒక సాధారణ ప్రమాదంగానే మిగిలేది. జూన్ 23న సియాగోయల్, చేతన్ చౌదరీలను పోలీసులు అరెస్టు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.