
ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కేవలం ఆధునిక కాలంలోనే కాకుండా, శతాబ్దాల క్రితమే ఈ ప్రాంతం ప్రముఖ రాజధానిగా, సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లింది.
ఈ నేపథ్యంలో 12వ శతాబ్దంలో అమరావతి రాజధాని చరిత్ర, నాటి భౌగోళిక పరిస్థితులు, ప్రాచీన శాసనాల వెనుక దాగున్న అద్భుతమైన నిజాలను ప్రముఖ చరిత్ర పరిశోధకుడు శివశంకర్ గారు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
చరిత్ర అనేది కేవలం డిగ్రీలు, పిహెచ్‌డిలు చేసిన మేధావుల గ్రంథాల్లోనే కాదు, లోకాన్ని చదివిన సామాన్యుల అన్వేషణలోనూ దాగి ఉంటుందని నిరూపిస్తున్నారు శివశంకర్ . పట్టుమని పదో తరగతి కూడా చదవకపోయినా, మన భౌగోళిక పరిస్థితులు, చారిత్రక శాసనాలు, ప్రాచీన ఆధారాలపై ఆయన సాధించిన పట్టు అసాధారణమైనది. ఆయన రాసిన "గుంటూరు జిల్లా అదృశ్య గ్రామాలు" అనే పరిశోధనా గ్రంథం చరిత్రకారులనే ఆశ్చర్యపరుస్తోంది. ఒక సాదాసీదా వ్యక్తి దశాబ్దాల పాటు తన సొంత సమయాన్ని, డబ్బును పణంగా పెట్టి, మరుగున పడిపోయిన గుంటూరు, అమరావతి ప్రాంతాల 12వ శతాబ్దపు రాజధాని వైభవాన్ని శాసనాల ఆధారంగా వెలికితీయడం ఒక అద్భుతమైన చారిత్రక యాత్ర. గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని అదృశ్య గ్రామాలు, ప్రాచీన శాసనాలపై ఆయన దశాబ్దాలుగా సాగించిన పరిశోధనలు నేటి విద్యావంతులను సైతం విస్మయపరుస్తున్నాయి.
పిహెచ్‌డిలు, డాక్టరేట్లు చేసిన వారు కూడా తాకని ఎన్నో అరుదైన చారిత్రక అంశాలను ఆయన సేకరించారు. నాటి కాలంలో గుంటూరు, విజయవాడ, అమరావతి పరివాహక ప్రాంతాల భౌగోళిక విస్తరణ ఏ విధంగా ఉండేదో శివశంకర్ ఆధారాలతో సహా వివరించారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని వివిధ చారిత్రక ప్రస్థానాలు, శాసనాల ప్రాధాన్యతను ఆయన గుర్తు చేశారు. ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలతో పోల్చితే.. ఇలాంటి ఒక అసాధరణ మేధస్సు కలిగిన వ్యక్తిశివశంకర్. 12వ శతాబ్దంలోనే కాకుండా, శతాబ్దాల కాలంగా ఈ ప్రాంతం ఎలా పరిణామం చెందిందనే విషయాలను ఆయన కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు. విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం వంటి చారిత్రక నగరాల వరుసలోనే గుంటూరు కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అమరావతి ప్రాంతం 12వ శతాబ్దంలో ఒక వెలుగు వెలిగిన రాజధానిగా ఎలా ఉండేదో, ఆ కాలపు రాజకీయ, సామాజిక పరిస్థితులు ఎలాంటివో శాసనాల సాక్షిగా ఈ పరిశోధన ద్వారా స్పష్టమవుతోంది.
ఈ ప్రాంత విద్యా సాంస్కృతిక చరిత్రను ప్రస్తావిస్తూ, 1920లలోనే గుంటూరు జిల్లా నుండి దాదాపు 50 మందికి పైగా లండన్, ఐర్లాండ్ వంటి విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఈ ప్రాంతంలో విదేశీ విద్య, సామాజిక చైతన్యం చాలా ముందే ప్రారంభమైందని చెప్పడానికి ఇదొక బలమైన నిదర్శనమన్నారు శివశంకర్.
సొంతంగా చిన్న ఉపాధి మార్గాన్ని వెతుక్కుంటూనే.. మరోపక్క చరిత్రపై ఉన్న అపారమైన జిజ్ఞాసతో శివశంకర్ పరిశోధనలు సాగించారు. ఎంతో సమయాన్ని, సొంత డబ్బును వెచ్చించి, ప్రాచీన ఆధారాలు, శాసనాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు.
చరిత్రను కేవలం పుస్తకాల్లోనే కాకుండా భౌగోళిక ఆధారాలతో సహా నిరూపించడానికి శివశంకర్ అందించిన ఈ చారిత్రక ఆధారాలు రాబోయే తరాలకు ఎంతో ఉపయోగపడతాయనడంలో సందేహంలేదు. ఇలాంటి నిష్ణాతులను ప్రభుత్వం మరియు సమాజం ఎంతగానో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
నవజాత శిశువుకు గోల్డ్ రింగ్ గిఫ్ట్.. తమిళనాడులో కొత్త పథకం
.