Old Pension Scheme : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఒక వర్గం ఉద్యోగుల డిమాండ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారికి పాత పెన్షన్ స్కీమ్ (OPS) ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు కేంద్ర పెన్షన్లు, పెన్షనర్ల సంక్షేమ విభాగం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ, పాత పెన్షన్ పథకమే కావాలంటూ ఉద్యోగులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఓ కేటగిరీ ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయడం ఊరట కల్పించే అంశంగా చెప్పవచ్చు. సాధారణంగా ఉద్యోగంలో చేసిన తేదీ ఆధారంగా పెన్షన్ నిర్ణయిస్తారు. కానీ ఈ ప్రత్యేక నిర్ణయం ప్రకారం ఉద్యోగంలో చేరిన తేదీతో సంబంధం లేకుండా, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న తేదీ ఆధారంగా పాత పెన్షన్ అర్హతను ఖరారు చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఇచ్చే ఉద్యోగాల విషయంలో ఈ నిబంధన వర్తిస్తుంది. ఏ కుటుంబ సభ్యుడైనా కారుణ్య నియామకం కోసం డిసెంబర్ 31, 2003 లేదా అంతకంటే ముందే దరఖాస్తు చేసుకుని ఉండి వారికి జనవరి 1, 2004 తర్వాత అపాయింట్మెంట్ లెటర్లు వచ్చి ఉంటే వారు ఈ పాత పెన్షన్ స్కీమ్ ఎంచుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2004 నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమలులోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి చేరిన వారందరికీ ఎన్పీఎస్ మాత్రమే వర్తింపజేశారు. అయితే, తాజా ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తు 2003 డిసెంబర్ లోపు ఉంటే అపాయింట్మెంట్ 2004 తర్వాత వచ్చినా వీరు ఓపీఎస్ పరిధిలోకి వస్తారు. ఈ మేరకు కేంద్రం మార్చి 3, 2023న ఇచ్చిన ఓ ఉత్తర్వు ఇచ్చింది. దాని ప్రకారం 2004 జనవరి 1 కంటే ముందే ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చి, ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన సాధారణ అభ్యర్థులకు ఓపీఎస్ ఎంచుకునే అవకాశం ఇచ్చారు. కానీ, అప్పట్లే కారుణ్య నియామకాల కింద వచ్చిన వారికి ఈ బెనిఫిట్ ఇవ్వలేదు. దీనిపై నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. వివిధ మంత్రిత్వ శాఖల సంప్రదింపులు, వ్యయ శాఖ, డీఓపీటీ పరిశీలనల అనంతరం కారుణ్య నియామక అభ్యర్థుల దరఖాస్తు తేదీనే ప్రామాణికంగా తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి కంట్రిబ్యూషన్ ఉండదు. కానీ, NPSలో ఉద్యోగి బేసిక్ శాలరీ నుంచి 10 శాతం కట్ చేస్తారు. ప్రభుత్వం కొంత చెల్లిస్తుంది. ఇక ఓపీఎస్ లో ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతంలో 50 శాతం మొత్తం స్థిరమైన పెన్షన్ వస్తుంది. ఎన్ పీఎస్ లో మార్కెట్ ఆధారంగా పెన్షన్ వస్తుంది.