మీరు చదివే గదిలో వెలుతురు తక్కువగా ఉంటే మెదడుకు అది విశ్రాంతి సమయంగా అనిపిస్తుంది. దీంతో నిద్ర వస్తుంది. అందుకే స్టడీ రూమ్‌లో వెలుతురు ఎక్కువగా ఉండాలి. నార్మల్ బల్బ్ బదులు ట్యూబ్ లైట్ వాడటం మంచిది.
కొంతమంది వెన్ను, భుజాలు వాల్చి కూర్చుని చదువుతారు. ఇలా కూర్చుంటే మీకు తొందరగా నిద్ర వస్తుంది. అందుకే వెన్నెముక, భుజాలు నిటారుగా ఉంచి చదవాలి. అందుకే బెడ్, మంచం మీద కాకుండా చదివేందుకు స్టడీ చైర్ ఉపయోగించడం మంచి పద్ధతి.
మీరు చదివే గదిలో గాలి ప్రవాహం బాగుండాలి. లేదంటే గదిలో ఉక్కపోత, శరీర వేడిగా మారి తొందరగా అలసిపోతారు. నిద్ర వస్తుంది. అందుకే చదువుకునే గది కిటికీ తెరిచి ఉంచండి. ఫ్యాన్ వేసుకోండి.
గంటలకొద్దీ బ్రేక్ లేకుండా చదివితే ఎలాంటి ఉపయోగం ఉండదు. మెదడు తొందరగా అలసిపోయి నిద్ర వస్తుంది. అందుకే 25 నిమిషాలు చదివి 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. దీనివల్ల మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది.
కొంతమంది పుస్తకంలోని పదాలను అలా చదువుతూ వెళుతుంటారు. ఇలా చేయడం వల్ల తొందరగా నిద్ర వస్తుంది. అందుకే నిద్ర రాకుండా ఉండేందుకు బిగ్గరగా చదవండి. చదువుతూ రాయండి. మెమొరీ టెక్నిక్ ఉపయోగించండి.
ఒకే సబ్జెక్ట్‌ను ఎక్కువసేపు చదివినా కూడా నిద్ర వస్తుంది. కాబట్టి డిఫరెంట్ సబ్జెక్ట్‌ను చదవండి. ఇలా చేయడం వల్ల మెదడు ఎక్కువగా గుర్తు పెట్టుకుంటుంది.
ఎక్కువసేపు ఒకేచోట కూర్చుంటే మెదడుకు రక్త ప్రసరణ తగ్గిపోయి విశ్రాంతి తీసుకోవాలన్న కోరిక పెరుగుతుంది. అందుకే కనీసం అరగంటకు ఓసారి బాడీని స్ట్రెచ్ చేయండి. ఓసారి లేచి వాకింగ్ చేయండి.
ఏం చేసినా కూడా మీ బాడీ ఇంకా విశ్రాంతి కోరుకుంటే ఓ చిన్న కునుకు తీయడం మంచిది. కేవలం 20-30 నిమిషాల పాటు కునుకు తీస్తే మెదడు యాక్టివ్ అవుతుంది.
చదివేటపుడు నిద్ర వస్తుంటే చల్లటి నీళ్లను ముఖంపై చల్లుకోండి. లేదంటే కూల్ వాటర్ తాగండి. దీంతో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉండే గింజలు, ధాన్యాలు, పండ్లు తీసుకోండి. ఇవి మీ ఎనర్జీ పెంచుతాయి.