
ఇంటర్నెట్ డెస్క్: రెండోసారి అధికారం చేపట్టిన అనంతరం ట్రంప్ (US President Trump) భారత సుంకాల (India Tariffs) విషయంలో సొంత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాపై భారత్ విధించే సుంకాలను తక్కువ చేసి చూపినందుకు వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా విడుదలైన ‘రెజీమ్ ఛేంజ్’ పుస్తకంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పుస్తకంలోని వివరాల ప్రకారం..
ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే విదేశాలు తమ దేశంపై విధించే సుంకాల వివరాలను అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) ట్రంప్ ముందు ఉంచింది. ఆ గణాంకాల్లో భారత్.. అమెరికాపై విధించే సుంకాలు తక్కువ మొత్తంలో ఉన్నట్లు చూపించడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ కనీసం 175 శాతం సుంకాలు విధించిందని వాదించారు.
భారత్, చైనాలు.. అమెరికాపై ఎంత సుంకం విధిస్తున్నాయనే కచ్చితమైన గణాంకాలు తెలియజేయకుండా చెత్త డేటాను ఇస్తున్నారని ట్రంప్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని వివరించడానికి లుట్నిక్ ప్రయత్నించగా.. అదంతా తప్పుడు డేటా అని కొట్టిపడేశారు. విదేశాలపై భారీ సుంకాలను విధించడానికి ట్రంప్ సలహాదారులు నివేదికలు రూపొందిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికా ఎగుమతులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. అనంతరం ఇరుదేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చల్లోనూ ప్రపంచ దేశాలన్నింటిలో భారత్ మాత్రమే తమపై అధికంగా సుంకాలు విధిస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తులపై భారత సుంకాలు సగటున 37 శాతం వరకు ఉన్నాయని.. కొన్ని రకాల ఆటోమొబైల్స్‌పై 100 శాతానికి మించి ఉన్నాయన్నారు. ఈ విషయంపై ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సైతం పలుమార్లు భారత్‌పై విమర్శలు చేశారు. అనంతరం ట్రంప్ భారత్‌పై భారీగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.